ప్రకాశం జిల్లాలో మద్యం మహమ్మారికి 13 మంది బలి అయ్యారు. మద్యానికి బానిసై మందు దొరక్క వ్యసనపరులు శానిటైజర్ తాగారు. రెండు వేర్వేరుచోట్ల జరిగిన ఘటనల్లో 13 మంది మృతి చెందారు. ప్రకాశం జిల్లా కురిచేడులో 10 మంది ప్రాణాలు కోల్పోగా... పామూరులో శానిటైజర్ తాగి ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగి 13 మంది మృత్యవాతపడ్డారు. మద్యం దొరక్క శానిటైజర్ తాగి చనిపోయినట్లు స్థానికుల వెల్లడించారు.
కురిచేడులో...
కురిచేడులో శానిటైజర్ తాగి 10 మంది మృతి చెందారు. మద్యానికి బానిసైన వీరు.. లాక్డౌన్ కారణంగా దుకాణాలు మూసివేయడంతో.. శానిటైజర్ సేవించారు. కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కురిచేడుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో లాక్డౌన్ విధించారు. మద్యం దొరక్క... దొరికినా ఎక్కువ ధర ఉండటంతో... చౌకగా లభ్యమయ్యే శానిటైజర్ తాగడం ప్రారంభించారు. 10 రోజులుగా సుమారు 20 మంది ఇదే అలవాటుగా చేసుకున్నారు.
ఎంతో కొంత మత్తు వస్తుండటంతో రోజు దీనినే కొనసాగించారు. యాచకులు రాజారెడ్డి, కొనగిరి రమణయ్య గురువారం మృతి చెందగా శానిటైజర్ల విషయం బయటకొచ్చింది. శుక్రవారం ఉదయానికి ఒకరి తరువాత ఒకరు మొత్తం 10 మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. యాచకులతో పాటు కడియం రమణయ్య, భోగ్యమ తిరుపతయ్య, అనిగొండ శ్రీను బాబు, గుంటక రామిరెడ్డి, రిక్షా పుల్లర్ చార్లెస్, ఆగస్టీన్ మృతి చెందారు.
పామూరులో...
ప్రకాశం జిల్లా పామూరులోనూ కొవిడ్ నిరారణ చర్యల్లో భాగంగా ఆంక్షలు విధించారు. ఇక్కడా మద్యం దొరక్క ముగ్గురు శానిటైజర్ తాగి మృతి చెందడం కలకలం రేపుతోంది. శానిటైజర్ తాగి షేక్ ఖాదర్, మల్లికార్జున్, రోశయ్య మృతి చెందారు.