ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా కాటు.. అప్పులపాలవుతున్న నేత కార్మికులు

కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడింది. చేనేత కార్మికులపై ఇది ఎక్కువగా ఉంది. పనుల్లేక, కూలీ రాక అప్పుల బాట పడుతున్నారు. కొంతమందికైతే రుణమూ దొరకని పరిస్థితి.

weavers troubles due to corona nellore
అప్పులపాలవుతున్న నేత కార్మికులు

By

Published : Apr 6, 2020, 2:00 PM IST

కరోనా లాక్‌డౌన్‌ ప్రభావంతో చేనేతలకు పనులు లేక అప్పులు చేసి జీవనం సాగించే పరిస్థితి ఏర్పడింది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 6,852 మంది చేనేత మగ్గాలు ఉన్నాయి. వీటిపై 10 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మరో 30 వేల మంది చేనేత అనుబంధ వృత్తుల వారు ఉన్నారు. గత నెల నుంచి సక్రమంగా పనులు లేక పరిస్థితి దారుణంగా మారింది. నేత కార్మికులు ప్రధానంగా మాస్టర్‌ వీవర్స్‌ పై ఆధారపడి జీవనం సాగిస్తారు. జరీ, నూలు, పట్టుతో చీరలు తయారు చేసి ఇస్తే వీవర్స్‌ వీరికి కూలీ ఇస్తారు. ఒక్కొక్క రకం, డిజైన్‌ ఆధారంగా కార్మికుడికి కూలీ గిట్టుబాటు అవుతుంది. గతంలో ఇంటి అవసరాలు, ఆరోగ్య పరిస్థితి సరిలేక మాస్ట్టర్‌ వీవర్స్‌ వద్ద కార్మికులు అప్పులు చేసి కూలీలో కొంత మేర పట్టి ఇచ్చేవారు. ప్రస్తుతం ప్రతి కార్మికుడికి కుటుంబ అవసరాలకు నెలకు రూ. 15 వేల మేర ఖర్చు పెడతాడు. నెల రోజులుగా పనులు లేక ‘ఆసామి’ అప్పు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. మాస్ట్టర్‌వీవర్స్‌ నుంచి చీరలు కొనుగోలు చేసిన వ్యాపారులు ప్రస్తుతం వీరికి నగదు చెల్లించే పరిస్థితి లేదు. దాంతో వీవర్స్ నేతన్నలకు నగదు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది.

ఈ క్రమంలో చేనేతలు ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు. జిల్లా మొత్తం మీద దాదాపు 3 వేల మంది కార్మికులు కుటుంబ అవసరాలకు నెలకు రూ. 10 వేల చొప్పున అప్పు చేసినా సుమారు రూ. 3 కోట్ల మేర అప్పులు చేసే పరిస్థితి ఉంది. దీనికి వడ్డీ చూస్తే రూ. 60 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. ఇది చేనేతలకు పెను భారమే. వీరు కాకుండా అనుబంధ వృత్తులు వారూ జీవనం సాగేంచేందుకు అప్పులు చేస్తున్నారు.

పూట గడవడమే కష్టంగా ఉంది

'కరోనా ప్రభావం వల్ల చేనేత పనులు నిలిచిపోయాయి. పూట గడవడమే కష్టంగా ఉంది. మగ్గం పైనే చీర తయారీ నిలిచిపోయింది. ప్రస్తుతం అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు. యజమానిని నగదు కావాలని అడిగితే బయట వ్యాపారులు నుంచి రావల్సిన నగదు నిలిచిపోయి ఇవ్వలేనన్నారు. ప్రభుత్వం ఇచ్చిన బియ్యంతో కాలం వెళ్లదీస్తున్నాం.' --- సజ్జా ఈశ్వరయ, నేత కార్మికుడు

మందులకు ఇబ్బందులు

'పది రోజులుగా పనులు లేక ఇబ్బందులు పడుతున్నాం. అసామి పడుగు, పేక ఇవ్వక మగ్గం ఖాళీగా ఉంది. ఆరోగ్యం సరిలేదు. మందులకు నగదు లేక అవస్థలు పడుతున్నాం. జరుగుబాటు కష్టంగా ఉంది.' --- గౌరాబత్తిన నాగయ్య, బంగారుపేట

బ్యాంకు రుణాలు లేవు

గతంలో చేనేతలకు ప్రభుత్వం తరఫున బ్యాంకుల్లో కొంత మేర రుణాలు ఇచ్చే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది. బ్యాంకులకు సక్రమంగా నగదు చెల్లించి మరోసారి రుణం ఇవ్వాలని కోరినా ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోగా బ్యాంకు వద్దకు రావద్దని చెప్తున్నారని నేతన్నలు వాపోతున్నారు.

ఇవీ చదవండి:

విజయనగరం పోలీసుల వినూత్న ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details