మండలాల నుంచి జిల్లాలకు రహదారుల అనుసంధానం పెరగనుంది. మండల కేంద్రాల నుంచి మరో మండల కేంద్రానికి వెళ్లే రహదారులను రెండు వరుసలుగా అభివృద్ధి చేయనున్నారు. ఈ పథకానికి గత ప్రభుత్వంలో రూపకల్పన చేయగా న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ) రుణ సాయానికి ముందుకొచ్చింది. ఎన్నికల ముందు పనులు ఆగటంతో మళ్లీ పథకాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడానికి చర్యలు చేపట్టింది. రహదారులు, భవనాల శాఖ నుంచి సవివర నివేదిక అందినందున ప్రభుత్వం టెండర్ల నిర్వహణకు చర్యలు చేపట్టింది. దీంతో గ్రామీణ రహదారులపై ఆశలు చిగురించాయి. ఇందులో రుణం 70 శాతం కాగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 30 శాతంగా ఉంటోంది. ఇలా వచ్చే మూడేళ్లలో పనులు పూర్తి చేయడానికి నిర్ణయించారు.
నెల్లూరు జిల్లాల్లో వివిధ శాఖల పరిధిలో 8,414.66 కి.మీ రహదారులున్నాయి. వీటిల్లో జాతీయ రహదారులు మొత్తం బీటీ కాగా స్టేట్ హైవేస్‌లో సీసీ, బీటీ రహదారులున్నాయి. జిల్లా మేజర్ రహదారుల్లో సీసీ, బీటీ రోడ్లు ఉన్నాయి. స్టేట్, జిల్లా రోడ్లు... రహదారులు, భవనాల శాఖ పరిధిలో ఉన్నాయి. ఆయా శాఖల్లో సీసీ రహదారులు 437.70 కి.మీలు కాగా బీటీ రహదారులు 4,701.00 కి.మీ, మెటల్ రహదారులు 590.91 కి.మీలు అన్‌మెటల్డ్ రహదారులు 2,685.05 కి.మీలు ఉన్నాయి.
వీటిల్లో అత్యధికంగా గ్రామీణ రహదారులు అన్మెటల్డ్గా ఉన్నాయి. వీటిల్లో కొన్నింటికి గతేడాది నిధులు మంజూరైనా పనులు సాగలేదు. ఈ రహదారుల్లో సింగిల్ లైన్ రహదారులు ఇక 2 వరుసలు కానున్నాయి. దీంతో మండలాల నుంచి జిల్లాకు వేగంగా వాహనాలు వెళ్లనున్నాయి. గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనుంది. గ్రామీణ ప్రాంతాల్లో రద్దీ ఉండే రహదారులను 2 వరుసలు చేయనున్నారు. ఇలాంటి రహదారుల ఎంపిక బాధ్యత రహదారులు-భవనాల శాఖ చూస్తోంది.
రెండు వరుసలుగా నాయుడుపేట-కోట రహదారి