Two youngsters died: రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలపై విధి కన్నెర్రజేసింది. తేనె సేకరణకు వెళ్లిన ముగ్గురు నిశిరాత్రిలో వాగులో కొట్టుకుపోయారు. వారిలో ఒకరు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడగా.. మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర సంఘటన వైఎస్ఆర్ జిల్లా గోపవరం మండలంలోని వల్లువారిపాళెం అటవీప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది.
తేనె కోసం వెళ్లి.. తిరిగిరాని లోకాలకు
తేనె సేకరణకు వెళ్లి.. ముగ్గురు వాగులో కొట్టుకుపోయిన ఘటన వైఎస్ఆర్ జిల్లాలో జరిగింది. వారిలో ఒకరు ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా.. మిగిలిన ఇద్దరు మృత్యువాత పడ్డారు. మృతులు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం దుర్గంపల్లి వాసులుగా గుర్తించారు.
ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం దుర్గంపల్లికి చెందిన మామిళ్ల రమేష్(35), మామిళ్ల వెంగయ్య(37) మృతి చెందగా.. మామిళ్ల శ్రీను తెల్లవారే వరకు వాగు నీటిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికి బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. దుర్గంపల్లికి చెందిన మామిళ్ల రమేష్, వెంగయ్య, శ్రీను.. అదే గ్రామానికి చెందిన మరో ఆరుగురితో కలిసి ఆదివారం మధ్యాహ్నం వల్లువారిపాళెం అడవిలోకి తేనె సేకరణకు ఆటోలో వెళ్లారు. కొంత దూరంలో వాహనం నిలిపి.. తేనె దొరికే కొండపేట్ల వద్దకు రాత్రి వెళ్లారు. రమేష్, వెంగయ్య, శ్రీను కొండ పైకి ఎక్కి తేనె తీయగా.. మిగిలిన వారు వాటి కింద ఉన్నారు. పని పూర్తయిన తర్వాత రమేష్, వెంగయ్య, శ్రీను కొండ పైనుంచి మధ్యలో ఉండే మదనసరి వాగును దాటి అవతలకు చేరాల్సి ఉంది. అది ఉద్ధృతంగా ఉండటంతో దాటలేమని భావించి పేటు కింద తలదాచుకున్నారు. ఈలోపు వాగు మరింత ఉద్ధృతంగా వచ్ఛి.. వారు అందులో కొట్టుకుపోయారు. మిగిలిన ఆరుగురు రాత్రి కావడంతో ఏమీ చేయలేక కుటుంబ సభ్యులకు తెలిపారు. తెల్లవారిన తర్వాత వాగు ఉద్ధృతి తగ్గడంతో గాలించారు. శ్రీను వాగులో చెట్టు కొమ్మ పట్టుకొని ఉండడాన్ని గమనించి బయటకు తీశారు. అనంతరం గాలించగా రమేష్ మృతదేహం దొరికింది. ఈలోపు దుర్గంపల్లి నుంచి వెళ్లిన బంధువులు, స్థానిక పోలీసులు అక్కడికి వెళ్లి గాలించగా వెంగయ్య మృతదేహం లభించింది. మృతదేహాలను బద్వేలుకు తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఇదీ చదవండి: