Somireddy Chandramohan Reddy about Silica Mining: ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలాల్లో సిలికా మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ మైనింగ్ చట్టాలు వైసీపీ పెద్దరెడ్ల కాళ్ల కింద నలిగిపోతున్నాయని అన్నారు.
వైసీపీ బినామీలు 1485 రూపాయలకు టన్ను అమ్ముకుంటూ లీజు ఓనర్లకు మాత్రం 100 రూపాయలు ఇవ్వడం దారుణం అన్నారు. అదేవిధంగా పేద వారి దగ్గర నుంచి.. మంచిగా పండే పంట భూములను తీసుకుంటున్నారని.. వారికి మాత్రం టన్నుకు 30 రూపాయలు ఇస్తున్నారని విమర్శించారు. ఎక్కువ మొత్తంలో సిలికా తీయడం వలన.. ఆ భూమి పంటలను పండించడానికి ఉపయోగం లేకుండా పోతోందని మండిపడ్డారు.
ప్రభుత్వ భూముల్లో ఎప్పటి నుంచో వేరుశనగ పండించుకునే రైతుల భూములు లాక్కొని వారికి టన్నుకు 20 రూపాయలు మాత్రమే ఇవ్వడం దుర్మార్గం అన్నారు. బ్రిటీష్ వారి కన్నా దారుణంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని అని చెప్పారు. 76 మంది లీజు హోల్డర్లు ఉండగా ఆ మైనింగ్లో అక్రమాలు చేసేది మాత్రం వైసీపీకి చెందిన నలుగురు బినామీ వ్యక్తులే అని చెప్పారు.
పర్యావరణ అనుమతులు ప్రకారం.. రెండున్నర మీటర్ల వరకే తవ్వకాలు జరపాల్సి ఉన్నా.. వైసీపీ బినామీలు మాత్రం అయిదు మీటర్ల వరకూ తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపించారు. సుమారు 300 ఎకరాల్లో అక్రమ మైనింగ్ జరుగుతుందని తెలిపారు. వైసీపీ బినామీ వ్యక్తులు నాలుగు రకాల కంపెనీలు పేర్లతో సిలికా స్టాక్ యాడ్లు పెట్టుకొని బహిరంగంగా దోపిడీ చేస్తుంటే ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. దీన్ని ఇంతటితో వదిలి పెట్టమని.. గూగుల్ మ్యాప్ పాయింటింగ్ తెప్పించి సిలికా మైనింగ్ మాఫియా అంతు చూస్తామని హెచ్చరించారు.
Somireddy about Silica Mining: 'మైనింగ్ మాఫియా.. పెద్ద రెడ్లు బినామీలే ' "సిలికాను..టన్ను 1485 రూపాయలకు అమ్ముకుంటున్నారు. టన్నుకు 100 రూపాయలు లోటస్ పాండ్‌లో ఇచ్చేయాలి. లెక్కల్లో మాత్రం 700 రూపాయలకు అమ్ముతున్నట్లు చూపిస్తున్నారు. సుమారు 300 ఎకరాల్లో అక్రమ మైనింగ్ జరుగుతుంది. పేదవారికి టన్నుకి 30 రూపాయలు ఇచ్చి.. వారి దగ్గర భూమి తీసుకుంటున్నారు. ఆ భూమిలో వాళ్లు వేరుశనగ వేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు మీరు మాత్రం టన్ను 1485కి అమ్ముకుంటున్నారు. లీజ్ ఓనర్లకు.. మీరు ఇచ్చే వంద రూపాయలకు కడుపుమండుతుంది. అలా అని ఇవ్వకుండా ఉండలేకపోతున్నారు. ఇందులో కేవలం నలుగురు మాత్రమే అంతా చేస్తున్నారు. వీళ్లంతా పెద్ద రెడ్లకు బినామీలు. ప్రభుత్వ భూములలో రెండున్నర మీటర్లకు అనుమతి ఉంటే.. మీరు మాత్రం 5 మీటర్ల వరకూ సిలికాను ఎత్తుతున్నారు". - సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి
ఇవీ చదవండి: