నెల్లూరు జిల్లాలో గత వారం రోజులుగా వాతావరణంలో మార్పులు సింహపురి కర్షకులను కుంగదీస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఎడగారు కోతలు జోరుగా సాగుతున్నాయి. నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి, బాలాయపల్లి, గూడూరు, కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. కొందరు కోతలు పూర్తిచేయగా, మరికొందరు రైతులు సిద్ధమయ్యారు. వీరికి కొనుగోళ్ల పరంగా తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొర్రీలు వేస్తుండగా.. ప్రైవేటు వ్యాపారులు ధర తగ్గించేయడం, ‘అదనం’ పెంచేయడంతో సమస్య ఏర్పడింది. ఈ స్థితిలో తాజాగా కురుస్తున్న వర్షాలు పంటల్ని ముంచేశాయి. జిల్లాలో చాలాచోట్ల కోతకు సిద్ధమైన వరిచేలు గాలివానకు నేలవాలగా, కొన్నిచోట్ల గింజలు మట్టికి అతుక్కుపోయి మొలకలు వస్తున్నాయి. నాయుడుపేట, బుచ్చిరెడ్డిపాళెం, పెళ్లకూరు తదితర చోట్ల నీటమునగడంతో కంకులు పాచిపోతుండటం కనిపిస్తోంది. కోత పూర్తయిన చోట టార్పాలిన్ పట్టలు లేక ధాన్యం రాశులను వర్షం బారి నుంచి కాపాడుకోలేకపోతున్నారు.
- ఇతర పంటలపైనా..
ఇక వరి తర్వాత జిల్లాలో వేరుశనగ రైతులు తీవ్రంగా నష్టపోయారు. వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గంలోని అనేక మండలాల్లో సమస్య ఏర్పడింది. నెలరోజుల క్రితం కురిసిన వర్షాలకు డక్కిలిలో పలువురు శనగ రైతులు దిగుబడిని నీట వదిలేసుకున్నారు. నాయుడుపేట ప్రాంతంలో వేరుశనగ రాశులు వర్షానికి తడిసిపోతున్నాయి. ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో పొగాకు రైతులపైనా ఇటీవల కురిసిన అకాలవర్షం ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం మెట్ట ప్రాంతంలో చిరుజల్లులు పడుతుండటంతో రైతులు వణికిపోతున్నారు. మళ్లీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు. ఉద్యాన రైతులకు కాస్త ఊరటనిస్తున్నా.. గాలులు ఇబ్బంది పెడుతున్నాయి.