నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని వరి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మండలంలోని కరటం పాడు గ్రామ పరిసర ప్రాంతాల్లో 1200 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. పంటను కోసి.. రైతు భరోసా కేంద్రాల వద్ద తమకు కేటాయించిన ప్రాంతాల్లో ధాన్యాన్ని కుప్పలుగా పోశారు. అధికారులు ఎప్పుడు తమ పంటను కొనుగోలు చేస్తారో అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
జిల్లా కేంద్రం నుంచి అనుమతులు రాలేదంటూ అధికారులు చడీ చప్పుడు లేకుండా ఉంటున్నారు. మరోవైపు.. ధాన్యం రాశులను కాపాడుకుంటూ రైతులు అక్కడే తిని, అక్కడే పడుకుంటున్నారు. వారం క్రితం లారీల్లో ఎక్కించిన ధాన్యం బస్తాలు సైతం వాహనాలతో సహా అక్కడే నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే.. రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో దళారులు మోసాలకు పాల్పడుతున్నారు. పుట్టికి ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.16,500 ఉండగా... అప్పుల బాధతో కొందరు రైతులు రూ.12వేలకే అమ్ముకుంటున్నారు.