ఎంతటి ట్రాఫిక్‌లోనైనా సైరన్ వేసుకుని సర్రున దూసుకెళ్తే ఈ అత్యవసర వాహనం.. ఇదిగో ఈ రోడ్డు దెబ్బకు కుయ్యోమొర్రో అంటూ ఆపసోపాలు పడుతోంది. మన రాష్ట్రంలో పెట్టుబడులకు బంగారు బాటలు పరుస్తున్నామని ప్రకటిస్తున్న పరిశ్రమల శాఖ మంత్రి గౌతంరెడ్డి ఇలాఖాలో ఇలాంటి గొప్పరోడ్లు ఏమూలకు వెళ్లినా.. కిలోమీటర్ల కిలోమీటర్లున్నాయి.
గజానికో గుంత
ఆత్మకూరు నుంచి సోమశిల వెళ్లే ప్రధానమార్గం.. 60 గ్రామాల ప్రజలు వెళ్లే.. ఈ రోడ్డు దాదాపు 45కిలోమీటర్లుటుంది. గజానికో గుంతతేలిన ఈ రహదారిలో ప్రయాణం అంటేనే.. వాహనదారుల గుండెలు జారిపోతున్నాయి.
ప్రమాదకరంగా రాకపోకలు
ఇది ఆత్మకూరు నుంచి.. వింజమూరు వెళ్లే మార్గం. 30 గ్రామాల ప్రజలు ఈ దారిలో రాకపోకలు సాగించే ఈ మార్గంలో.. ఏడు చప్టాలున్నాయి. అవన్నీ కుంగిపోయి ప్రమాదకరంగా మారాయి. ఇటీవలి వర్షాలకు.. చిన్న చిన్న గోతులూ నీటి మడుగుల్లా మారాయి. అనేక చోట్ల తారు పెచ్చుపెచ్చులుగా.. లేచింది. రోజూ రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సులు, ఆటో డ్రైవర్లు.. పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయని వాపోతున్నారు.