అది నెల్లూరు జిల్లా (nellore district)నగరపాలక సంస్థ.. కలెక్టర్ సహా ఇతర అధికారులుండే ప్రాంతం.. సుమారు 100కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల స్థలం.. దానిపై ఓ రాజకీయ నాయకుడు కన్నేశాడు. కోర్టు ఉత్తర్వులున్నా.. ఆయన పని ఆయన చేస్తూనే ఉన్నాడు! నెల్లూరు నగరంలోని కీలక ప్రాంతమైన వేదాయపాళెంలో రైల్వేస్టేషన్‌కు ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలంలో కొన్నేళ్లుగా ఆక్రమణలు( government land occupied) జరుగుతున్నాయి. కానీ.. పట్టించుకునే నాథుడే లేడు.
పదేళ్ల కిందటే సదరు స్థలాన్ని ప్రభుత్వ భూమిగా గుర్తించి.. దాన్ని రక్షించే బాధ్యతను రెవెన్యూ అధికారులకు అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ.. దానిపై కన్నేసిన ఓ నాయకుడు ఆక్రమణ మొదలు పెట్టాడు. అధికారులు బదిలీపై వెళ్లిన ప్రతిసారీ కొంత భాగాన్ని ఆక్రమించి.. నిర్మాణాలు చేపడుతున్నారు. తాజాగా దాన్ని ప్లాట్లుగా మార్చి నిర్మాణాలు చేపట్టడం వివాదాస్పదంగా మారింది.
ఈ భూమిని 1978లో ఆశ్రమం నడుపుకోవడానికి దండికుంట వెంకట రమణాజీ అనే వ్యక్తికి.. నాటి డీఆర్వో కేటాయించారు. 1989లో దీనిపై కొందరు ఫిర్యాదు చేయగా.. ఈ కేటాయింపును భూ పరిపాలన శాఖ కమిషనర్ రద్దు చేశారు. 2004లో రమణాజీ మృతిచెందిన తర్వాత.. ఆశ్రమ ట్రస్టులో సభ్యులుగా ఉన్న ఓ మాజీ కార్పొరేటర్ బంధువులు భూమి అమ్మకాలు ప్రారంభించారు. ఆశ్రమానికి భూమి కేటాయించిన పత్రాలను మాత్రమే చూపించి.. రద్దు చేసిన ఉత్తర్వులను మరుగుపరిచి విక్రయాలు జరిపారు.
ఇలా క్రయవిక్రయాల ద్వారా వ్యూహం ప్రకారం ఈ ప్లాట్లకు లింకు డాక్యుమెంట్లు సృష్టించారు. ఈ విషయంపై నాటి కలెక్టర్ జానకికి ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా.. దాన్ని పరిశీలించి ఆ భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు. 2013లో హైకోర్టు ఆ భూమిని ప్రభుత్వ స్థలంగా గుర్తిస్తూ.. దాన్ని కాపాడే బాధ్యతను రెవెన్యూ అధికారులకు అప్పగించింది. 2015లో అధికారులు మారడంతో.. తిరిగి ఆ భూమిని ఆక్రమించేందుకు కొందరు అక్రమార్కులు సన్నాహాలు చేశారు. తాజాగా ఆ స్థలంలో కంచె, బోర్డులు తొలగించి, నిర్మాణాలు చేస్తున్నారు. ఈ ఆక్రమణ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో.. విచారణకు ఆదేశించారు. రెవెన్యూ సిబ్బందితో కలిసి RDO ఆ స్థలాన్ని పరిశీలించారు. ఇది ప్రభుత్వ భూమిగా గుర్తించామని.. దీన్ని పరిరక్షిస్తామని చెబుతున్నారు. మరి, ఇకనైనా ఈ ఆక్రమణలకు అడ్డుకట్ట పడుతుందేమో చూడాలి.
ఇదీ చదవండి