పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అన్నగారి పాలెం సబ్ స్టేషన్ నుంచి లక్ష్మీపురం, ఒట్టూరు సమీపంలోని పాతూరు వరకు 11 కేవీ విద్యుత్ తీగలు ఉన్నాయి. ఈ విద్యుత్ తీగలు వేసి ఏళ్లు గడుస్తుండం వల్ల కొద్దిపాటి గాలి వీచిన తెగిపడుతున్నాయి. ఈ సమస్యతో... సమీపంలోని నివాస ప్రాంతాల ప్రజలతో పాటు, ఆక్వా రైతులు అవస్థలు పడుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల ప్రతిసారి జనరేటర్‌పై ఆధారపడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. విద్యుత్ సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల రొయ్యల ఎదుగుదలకు ఆటంకాలు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. రొయ్యలు ఎదుగుదల లేక నష్టపోతామని ఆక్వా రైతులు చెబుతున్నారు.
చిన్న గాలి వచ్చిన కరెంట్ లైన్ కట్ అయిపోతుంది. ఒక ట్రాన్స్ఫార్మర్కి నాలుగు గంటలు కరెంట్ నిలిచిపోవడం, ఆ సమయంలో మేము జనరేటర్లు వాడాల్సివస్తోంది. డీజిల్ ఖర్చు సుమారు గంటకి వెయ్యి రూపాయలు వస్తుంది. అందరు రైతులదీ ఇదే పరిస్థితి. వారానికి నాలుగైదు సార్లు లైన్లు తెగిపోతున్నాయి. తెగిన కరెంట్ తీగలు తొక్కి మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇలాంటి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ---శివ,ఆక్వా రైతు
ఏరియేటర్లే రొయ్యలకు ఆధారం
ఒక ఎకరా రొయ్యల సాగుకు సుమారు 12 నుంచి 14 లక్షలు ఖర్చవుతుంది. ఒక క్రాప్ 90 రోజుల నుంచి 120 రోజుల వరకు పడుతుంది. విద్యుత్ లేకపోవడంతో రొయ్యలకు ఆక్సిజన్ అందక చనిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల 24 గంటల్లో పగలు మేత వేసే సమయంలో రెండు గంటలు మాత్రమే ఏరియేటర్లు ఆపుతారు. మిగిలిన అన్ని వేళల్లో తప్పనిసరిగా రొయ్యలకు ఆక్సిజన్ అందుతూ వుండాలి. విద్యుత్ సరఫరా లేక ఏరియేటర్లు తరచూ నిలిచిపోవడం ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆక్వా రైతులు ఆవేదన చెందుతున్నారు.