కేసుల నుంచి కుటుంబ రక్షణ కోసమే దిల్లీకి జగన్..: లోకేశ్ Nara Lokesh Yuvagalam Padayatra: తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చి మండలం చెల్లాయపాళెం విడిది కేంద్రం నుంచి 148వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. బ్యాండ్ మేళాలు, బాణసంచా మోతలు, భారీ జన సందోహం మధ్య లోకేశ్ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్రలో ముందుకు సాగారు. బుచ్చి సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో లోకేష్ పాల్గొని ప్రసంగించారు. నెల్లూరు యువగళం దెబ్బకి జగన్ శాశ్వతంగా ఇడుపులపాయ ప్యాలస్‌కి వెళ్లడం ఖాయమన్నారు. అమ్మఒడికి బటన్ నొక్కినా డబ్బులు మాత్రం పడటం లేదు.. జగన్ బటన్‌కి కరెంట్ పోయిందని ఎద్దేవా చేశారు.
కేసుల నుంచి రక్షణ కోసమే జగన్ దిల్లీ వెళ్లాడు..బాబాయ్ హత్య కేసుకు సంబంధించి సీబీఐ చార్జిషీట్లో ఏ8గా ఉన్న అవినాష్‌ని కాపాడటానికి.. ఏ9గా జగన్ పేరు పెట్టకుండా ఉండడానికా, భార్య భారతీ రెడ్డి పేరు ఛార్జ్ షీట్లో లేకుండా చెయ్యడానికి జగన్ దిల్లీవెళ్లాడని ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు. బాబాయ్ మర్డర్ జగనాసుర రక్త చరిత్రని విమర్శించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతు లేని రాజ్యం తెస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ వన్ అయితే.. కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్‌టూగా ఉందన్నారు.
వైఎస్సార్సీపీ నేతల వేధింపుల వల్లే తాడిపత్రి సీఐ ఆత్మహత్య..తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నేతల ఒత్తిడి వల్లే దళిత సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కుమార్తె చెప్పిందన్నారు. ఓ పోలీసుకి కష్టం వస్తే గతంలో రాష్ట్రంలో ఉన్న పోలీసులందరూ ప్రశ్నించేవారని.. ఇప్పుడు కనీసం ఎవరూ స్పందించడం లేదన్నారు.
ఎమ్మెల్యే జిల్లాను లూటీ చేశాడు.. కోవూరులో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏముందని లోకేశ్ ప్రశ్నించారు. శాండ్, ల్యాండ్, వైన్, మైన్, బెట్టింగ్, రియల్ ఎస్టేట్ మాఫియాకి కేర్ ఆఫ్ అడ్రెస్‌గా కోవూరును మార్చేసారని ధ్వజమెత్తారు. ప్రసన్న బ్యాంకులను కూడా మోసం చేసి, దొంగ పత్రాలతో 8 కోట్లు లేపేసాడని, గోవా, పాండిచ్చేరి నుంచి మద్యం తెచ్చి అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని అన్నారు. కనిగిరి రిజర్వాయర్ పక్కనే 100 కోట్లు విలువైన గ్రావెల్ తవ్వేసి అమ్ముకున్నారని, టీచర్ల బదిలీలకు డబ్బులు వసూలు చేశారన్నారు. 84 కోట్లతో చేపట్టిన మలిదేవి కాలువ పనుల్లో 25 శాతం, 96 కోట్ల ఎఫ్డీఆర్ పనుల్లో 60 శాతం కమీషన్ ప్రసన్న తీసుకున్నారని ఆరోపించారు.
పనులు చెయ్యకుండానే, కాలువలు తొవ్వకుండానే బిల్లులు డ్రా చేసి 58 కోట్లు తినేశారని చెప్పారు. వవ్వేరు కోపరేటివ్ బ్యాంకులో ప్రసన్న అనుచరులు 8 కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేసారన్నారు. రియల్ ఎస్టేట్ మాఫియా ద్వారా 100 కోట్లు నొక్కేశారని అన్నారు. 2019కి ముందు ప్రసన్నకు 50 కోట్ల అప్పు ఉంటే నాలుగేళ్లలో1500 కోట్లు సంపాదించాడని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కోవూరులో వైఎస్సార్సీపీ నేతల అవినీతిపై ప్రత్యేక సిట్ వేసి, అవినీతి ద్వారా సంపాదించిన సొమ్మును తిరిగి వసూలు చేస్తామన్నారు.