ఇటీవల నెల్లూరు జిల్లా సంగం మండల ప్రాంతంలో ధాన్యం కొనుగోలుపై గిట్టుబాటు ధరలు లేవంటూ రైతులు నిరసన చేపట్టడంతో.. సంగం మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సందర్శించారు. మేకపాటి గౌతమ్ రెడ్డి రైతులతో నేరుగా మాట్లాడారు. రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని.. దీనిపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ఉన్నారని తెలిపారు.
ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లతో మంత్రి మేకపాటి మాట్లాడుతూ... తప్పనిసరిగా రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. లేనిపక్షంలో ఇతర జిల్లాల నుంచి మిల్లర్లను పిలిపించి జిల్లాలోని ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హెచ్చరించారు. మాట వినని మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో పండించిన ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని.. అవసరమైతే గోదావరి జిల్లాలతో పాటు ఇతర జిల్లాలకు ధాన్యాన్ని తరలిస్తామని చెప్పారు.