నెల్లూరు నగరానికి కొన్నేళ్ల కిందట విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వేలాది మంది కూలీలు వలస వచ్చారు. నగరం చుట్టు పక్కల 20వేల మందికిపైగా వలస కూలీలు నివాసాలు ఉంటూ.. స్థానికంగా ఉపాధిని పోందుతూ.. ఉండేవారు . కరోనా కారణంగా నేడు వీరంతా నగరంలోని పలు కూడళ్లలో పనుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది.
ఇసుక కొరతతో పనులకు ఆటంకం..
తెల్లవారు జామునే అన్నం క్యారేజిల్లో పెట్టుకుని భార్యాభర్తలు పనుల కోసం వస్తారు. నగరంలోని స్టోన్ హౌస్ పేట, కొండాయిపాలెం, అయ్యప్పస్వామి దేవాలయం వంటి కూడళ్లలో వేచి చూస్తే... మునుపు పనులు దొరికేవి. ఒక్కొక్కరికి రోజుకు 600రూపాయలు కూలీ లభించేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కేవలం 20శాతం మందికి మాత్రమే పనులు దొరుకుతున్నాయి. ఇసుక సమస్యతో భవన నిర్మాణ పనులు వేగంగా జరగడంలేదు. ప్రభుత్వం పనులు తక్కువగా జరుగుతున్నాయి. దీంతో ఉపాధి లభించక... తిరిగి ఇళ్లకు కూడా వెళ్లలేని స్థితికి చేరుకున్నామని వాపోతున్నారు.