Lokesh Yuvagalam Padayatra: నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్ర జగన్‌కి భయాన్ని పరిచయం చేసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. నెల్లూరులో 146వ రోజు యువగళం పాదయాత్ర సందర్భంగా వీఆర్సీ సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ క్రమంలో అధికార పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జనం.. జనం.. జనం.. ప్రభంజనం, సింహపురిలో సింహ గర్జన అదిరిపోయిందని అన్నారు. హూ కిల్డ్ బాబాయ్? హూ కిల్డ్ వివేకా? పిన్ని తాళి తెంచింది ఎవరు? అబ్బాయ్ కిల్డ్ బాబాయ్. పిన్ని తాళి తెంచింది జగనే. బాబాయ్ మర్డర్ ఎవరి రక్త చరిత్ర అని లోకేశ్ ప్రశ్నించారు.
జగన్‌కు 'గంజాయి బ్రో' అని ముద్దుగా పేరు పెట్టా అని అన్న లోకేశ్.. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్ అని మండిపడ్డారు. ఒక్క నెల్లూరు టౌన్లోనే 17 వేల టిడ్కో ఇళ్లు కట్టామని.. సీసీ రోడ్లు, తాగునీటి పథకాలు, పార్కులు, ఎల్ఈడి లైట్లు, అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేసామన్నారు. నారాయణ అభివృద్ధిలో మాస్టర్ అని.. నారాయణ ఎక్కడ ఆపేశారో అక్కడ నుంచి నెల్లూరు అభివృద్ధి మళ్లీ రీస్టార్ట్ చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు, టిడ్కో ఇళ్లు పూర్తి చేసి అందిస్తామన్నారు. నెల్లూరు టౌన్లో స్వర్ణకారులు పడుతున్న కష్టాలు తనకు తెలుసని.. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే స్వర్ణకారులను ఆదుకుంటామన్నారు. అలాగే అనిల్ అక్రమార్జన విలువ రూ.వెయ్యి కోట్లని ఆరోపించారు. నెల్లూరు జిల్లాని వైఎస్సార్సీపీ నేతలు నాశనం చేశారని.. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్, క్రికెట్ బెట్టింగ్ మాఫియాలకు అడ్డాగా మార్చేశారని ఆగ్రహించారు.