అభివృద్ధి మాట మరచి, అవినీతి, అరాచకంతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న వైకాపాకు తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలతో గుణపాఠం నేర్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించాలని కోరుతూ నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఆయన ప్రచారం నిర్వహించారు. ఓం నగర్ నుంచి ముత్తుకూరు ఆర్టీసీ బస్టాండ్ వరకు పాదయాత్ర చేస్తూ, తేదేపాను గెలిపించాలని కోరుతూ ఓటర్లకు కరపత్రాలు అందించారు. పాదయాత్రకు తెదేపా కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అడుగడుగున హారతులిస్తూ లోకేశ్‌కు బ్రహ్మరథం పట్టారు.
తిరుపతి నుంచే మార్పు..
తిరుపతి ఉప ఎన్నికల నుంచే మార్పు ప్రారంభం కావాల్సిన అవసరముందని ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పిలుపునిచ్చారు.
ఓ చేత్తో రూ.10 , మరో చెత్తో 100 దోపిడీ..
వైకాపా అధికారం చేపట్టిన తర్వాత ప్రజలపై అన్ని రకాలుగా భారాలు మోపుతూ, ఓ చేతితో పది ఇస్తూ, మరో చేతితో వంద రూపాయలు తీసుకొనే పరిస్థితి నెలకొందన్నారు. దుగరాజపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టు గురించి పట్టించుకునే నాథుడే కరవయ్యారని దుయ్యబట్టారు.