వైకాపా ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. ఇసుక, మద్యం, భూమి.. ఇలా దేన్ని వదలడం లేదు. రాష్ట్రంలో 150 దేవాలయాలపై దాడులు జరిగితే.. ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేకపోయింది. దాడులను అడ్డుకోలేకపోయింది. లౌకికంగా ఉండాల్సిన ప్రభుత్వం ఒక మతానికి కొమ్ముకాయడంతో పాటు.. అక్కడున్న వారికి జీతాలు, భవనాలు నిర్మించి ఇస్తోంది....’ అని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధ్వజమెత్తారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ‘భాజపా వైఖరి దీనికి పూర్తిగా భిన్నం. కులం, మతం, ప్రాంతం అంటూ తేడా లేకుండా అందరి సంక్షేమాన్ని కాంక్షిస్తూ.. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్‌లను పాటిస్తూ.. అసలైన లౌకిక పార్టీగా ముందుకు వెళుతోందని’ ఆయన పేర్కొన్నారు. ‘రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. దాదాపు రూ.4లక్షల కోట్ల బకాయిలు ఉన్నాయి. వాటితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారా? అంటే.. ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం చేకూర్చని వాటికి ఖర్చు చేస్తున్నారు. రాయలసీమ రాళ్లసీమగా మారింది. ఇప్పటివరకు తెదేపా, వైకాపా పాలనలను చూశారు. ఇప్పుడు భాజపాకు అవకాశం ఇవ్వాలి...’ అని ఆయన కోరారు. రాష్ట్రంలో మార్పు రావాల్సి ఉందని, ఆ మార్పునకు తిరుపతి ఉపఎన్నికలు వేదిక కావాలన్నారు. 17న జరిగే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి రత్నప్రభను గెలిపిస్తే.. ఈ ప్రాంతాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సభావేదిక సాక్షిగా హామీ ఇస్తున్నానని జేపీ నడ్డా ప్రకటించారు. తద్వారా ప్రధాని నరేంద్ర మోదీని బలపర్చడమే కాకుండా.. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి దోహదపడిన వారవుతారన్నారు.
తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు
తిరుమల, న్యూస్‌టుడే: ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా పేర్కొన్నారు. సోమవారం ఆయన కుటుంబసభ్యులు, పార్టీ సీనియర్ నాయకులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. కరోనా నుంచి భారతదేశం విముక్తి కావాలని, ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించానని చెప్పారు. తిరుమలలోని శ్రీ కృష్ణ అతిథిగృహం వద్దకు చేరుకున్న పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
రాష్ట్రాభివృద్ధికి పెద్దఎత్తున నిధులిచ్చాం
గడిచిన ఆరేళ్లలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు సమకూర్చిన విషయాన్ని అందరూ గుర్తు చేసుకోవాలని జేపీ నడ్డా పేర్కొన్నారు. ‘పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు ఎంత ముఖ్యమో.. కేంద్రానికీ అంతే ముఖ్యం. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేస్తే కేంద్రానికి నష్టమైనప్పటికీ.. ఇచ్చిన మాట ప్రకారం డీపీˆఆర్ సిద్ధం చేస్తున్నాం. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్‌ను పూర్తి చేస్తాం...’ అని ఆయన వెల్లడించారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య, విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన నేలపై అడుగుపెట్టడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సభలో సినీ నటి హేమ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు సోము వీర్రాజు సమక్షంలో భాజపాలో చేరారు. కేంద్ర మంత్రి మురళీధర్, పార్టీ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరీ, ఎంపీలు టీజీ వెంకటేష్, జీవీఎల్ నరసింహారావు, జనసేన నేత నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఏడు నియోజకవర్గాల ప్రజలు దీవించాలి: రత్నప్రభ