సోమశిలపై.. సీఎం జగన్కు లోక్సత్తా జేపీ లేఖ - letter
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్కు లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ లేఖ రాశారు. సోమశిల ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన చేపట్టాలని కోరారు.
సోమశిల ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ లేఖ రాశారు. సోమశిల రిజర్వాయర్ బద్వేల్ చెరువుతో అనుసంధానం చేసే ఎత్తిపోతలను ప్రధానాంశంగా తీసుకుని వేగంగా అమలు చేయాలని లేఖలో కోరారు. 2017 నవంబర్లో తాను ఈ ప్రాంతంలో పర్యటించానని.. తాగు సాగునీటి అవసరాలకు ఈ ప్రాజెక్టు అవసరమని ప్రజలు కోరారని తెలిపారు. ప్రజలు, రైతుల మద్దతుతో పీపుల్ అగైనెస్ట్ కరప్షన్ అనే స్వచ్ఛంద సంస్థ అనేక సార్లు విజ్ఞాపనలను చేసిందని వివరించారు. చివరికి ఒక టీఎంసీ నీటిని కేటాయిస్తూ 2019 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం 197 జీవో కూడా విడుదల చేసిందని గుర్తు చేశారు. ఈ పథకం అమలైతే గోపవరం మండలాల్లోని లక్షా 28వేల మంది ప్రజానీకానికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. 33 చెరువులకు నీరు అందుతుందని తద్వారా తాగు సాగునీటి అవసరాలు తీరుతాయని వివరించారు. దీనిపై దృష్టి సారించి కరవు పీడిత రైతులను ఆదుకోవాలని జేపీ లేఖలో కోరారు.