నెల్లూరు జిల్లాలో షీర్ వాల్ టెక్నాలజీతో 35వేలకు పైగా ఇళ్లు నిర్మించారు. నగరపాలక సంస్థ, పురపాలక సంఘాల పరిధిలో గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించింది. ఎన్నికలకు ముందు లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించారు. కొత్త ప్రభుత్వం వచ్చి ఇస్తుందనుకుంటే చివరికి నిరాశే మిగిలింది. తమకు కేటాయించిన ఇళ్లు ఇవ్వాలని కోరుతున్నా... అధికారులెవరూ స్పందించట్లేదని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ఆ ఇళ్లలో చెట్లు పెరిగి.... అద్దాలు పగిలి దుర్భరంగా తయారయ్యాయని వాపోతున్నారు.
కరోనా కాలంలో అద్దెలు కట్టుకోలేక, కుటుంబాన్ని పోషించలేక ఇబ్బంది పడుతున్నామని.. సిద్ధంగా ఉన్న ఇళ్లయినా ఇస్తే కొంత భారం తగ్గుతుందని లబ్ధిదారులు అంటున్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ఇళ్లు... నిరుపయోగంగా వదిలేయటంతో ప్రభుత్వ ధనం వృథా అవుతోందని ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి లబ్ధిదారులకు కేటాయించాలని కోరుతున్నారు.