పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించిన డీపీవో - dpo conducted meeting in nellore district
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆత్మకూరు డివిజన్లో అన్ని పంచాయతీల్లో శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు నెల్లూరు జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మీ తెలిపారు. ఈ మేరకు ఉదయగిరి మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఇంజనీరింగ్ సహాయకులతో ఆమె సమావేశం నిర్వహించారు.
ఆత్మకూరు డివిజన్లో కరోనా పాజిటివ్ కేసులు ఉద్ధృతి కొనసాగుతున్నందున అన్ని పంచాయతీల్లో శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు నెల్లూరు జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ సహయకులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా కాలువల్లో పూడిక తీయడం, బ్లీచింగ్ చల్లిచడం, సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి వంటి పనులు చేయించాలని, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ సహాయకులు బాధ్యత తీసుకొని ప్రత్యేక డ్రైవ్ కొనసాగించేలా చూడాలన్నారు. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురుస్తున్నందున నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నీరు నిల్వ ఉంటే దోమ లార్వా పెరిగి డెంగీ, గన్యా లాంటి జ్వరాలు ఉద్ధృతం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. కరోనా తరుణంలో ప్రజలు మాస్కులు లేకుండా బయటకు వస్తే మెుదటి సారి రూ.100, రెండోసారి రూ.200 మూడోసారి 500 జరిమానా విధించాలన్నారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని సందర్శించి దస్త్రాలను తనిఖీ చేసి ప్రజలకు అందిస్తున్న సేవలపై ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు.