Cyclone Mandous Losses For farmers In Nellore: నెల్లూరు జిల్లాలో మాండౌస్ తుపాను మిగిల్చిన నష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఐదు రోజులు పూర్తైనా పొలాల్లో నీరు తగ్గడం లేదు. రైతులు పంటలపై ఆశలు వదులుకున్నారు. పంట నష్టం అంచనా వేయడానికి అధికారులు కనీసం అటువైపు కూడా రావడంలేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కందుకూరు నుంచి సర్వేపల్లి, వెంకటాచలం వరకు ప్రతి మండలంలో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పొలాల్లోని నీరు బయటకు వెళ్లే మార్గాలు లేక.. చెరువుల్లా మారాయి.
డ్రెయిన్ల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా కాలువల్లో పూడికలు పెరిగిపోయాయి. దీంతో వర్షం నీరు బయటకు వెళ్లే దారిలేక పొలాలను ముంచేసింది. కాలువల ప్రాధాన్యాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోలుకోలేనిరీతిలో నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
తెలుగుదేశం నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి..నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించారు. ముత్తుకూరు, ఆమదాలపాడు, బండ్లపాలెం సహా పలు గ్రామాల్లో నీట మునిగిన పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. వరకవిపూడి చెరువు కలుజు ఎత్తు పెంచడం వల్ల 7 గ్రామాల్లోని వెయ్యి ఎకరాల్లో వరి నాట్లు మునకకు గురయ్యాయని రైతులు సోమిరెడ్డికి తెలిపారు. వ్యవసాయ మంత్రి ఇలాఖాలో ఇంత పెద్దఎత్తున నష్టం సంభవించినా మంత్రి స్పందించకపోవడం దురదృష్టకమని..సోమిరెడ్డి ఆక్షేపించారు.