ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: కూలీల కొరతతో రైతులకు తప్పని తిప్పలు - corona effect on farmers

కరోనా వైరస్ ప్రభావంతో వరి నాట్లు వేసేందుకు కూలీలు రాక నెల్లూరు జిల్లా రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. కొంతమంది నాట్లు వేయలేక వరి నారుమళ్లు వదిలేస్తున్నారు. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో జిల్లా రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.

By

Published : May 17, 2020, 5:51 PM IST

నెల్లూరు జిల్లాలో పెన్నా డెల్టా ఆయకట్టు పరిధిలో లక్షాఎనభై వేల ఎకరాలు, కావలి కాలువ, దక్షిణ కాలువ ,జీకేఎన్ కాలువ పరిధిలో 67 వేల ఎకరాలలో వరిసాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో వరినాట్లు వేసేందుకు కూలీలు రావడంలేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు అంటున్నారు. కొన్ని గ్రామాలలో వరినాట్లు వేసేందుకు అసలు కూలీలే రావడంలేదని ఏం చేయాలో అర్థం కావడం లేదని కొంతమంది రైతులు మనోవేదనకు గురవుతున్నారు.

ఎకరం నాట్లు వేసేందుకు గతంలో 3,500 తీసుకునే వారని... ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో ఎకరం వరి నాట్లు వేసేందుకు 6 నుంచి 7 వేల రూపాయలు అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. 7 వేలు ఇస్తానంటున్న కూలీలు కరోనా వైరస్ ప్రభావంతో అసలు రావడం లేదంటున్నారు. కూలీలు రాకపోవడంతో కొంతమంది రైతులు నారుమళ్లు కూడా వదిలేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

కరోనా వైరస్ ప్రభావంతో కూలీల కొరతతో జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని... రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా వరినాట్లు వేసేందుకు అనుమతినివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

కూలీలు రాక రైతులు వరి నాట్లు వేయలేకపోతున్న మాట వాస్తవమేనని నెల్లూరు జిల్లా సంయుక్త సంచాలకులు ఆనంద కుమారి అన్నారు. కూలీల సమస్య తీర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, రైతులు అధైర్య పడవద్దని ఆమె భరోసానిచ్చారు. వెద పద్ధతిలో వరి సాగు చేయాలని ఆమె సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details