Jagananna Colony : పేదలందరికీ ఇళ్లు అని ప్రభుత్వం ప్రకటించినట్లుగా.. నెల్లూరు జిల్లాలో జగనన్న లేఅవుట్లలో నిర్మిస్తున్న అనేక ఇళ్లు ఇంకా పునాదుల స్థాయిని దాటలేదు. అదికాకుండా ప్రభుత్వ లే అవుట్లలో కేటాయించిన స్థలాలలో.. ఇళ్ల నిర్మాణానికి లబ్దిదారులు ఆసక్తిగా లేరు. నిర్మాణ ఖర్చులు పెరగటంతో వారు ఇళ్లను నిర్మించుకోవటానికి ముందుకు రావటం లేదు. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి అందిస్తున్న నగదు చాలకపోవటంతో.. ఆసక్తి చూపటం లేదు. ప్రభుత్వం చెల్లిస్తున్న నగదుతో ఇంటి నిర్మాణం పూర్తికాదని లబ్దిదారులు వాపోతున్నారు. ప్రభుత్వం కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నామని.. ఇళ్లకు అద్దెలు చెల్లించటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. కొన్ని చోట్ల అప్పులు చేసి ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికి.. బిల్లులు పెండింగ్లో ఉన్నాయని లబ్దిదారులు ఆరోపిస్తున్నారు.
ముందుకు సాగని పనులు : నెల్లూరు జిల్లాలో సుమారు 75 వేల 94 మందికి ఇళ్ల స్థలాలను కేటాయించారు. 16 వేల 898 ఇళ్లను ఉగాదికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా అందులో.. ఆరు వేల 718 ఇళ్ల నిర్మాణాలను మాత్రమే పూర్తి చేశారు. 9 వేల 827 ఇళ్ల నిర్మాణాలను ఇంకా ప్రారంభించనేలేదు. గృహప్రవేశాల కోసం ఏప్రిల్ 15వ తేదీని ప్రకటించారు. వాస్తవంగా చూస్తే ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రకటించిన తేదీకి ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే విధంగా కనిపించటం లేదు. ప్రతి శనివారం రోజు అధికారులు హౌసింగ్డే నిర్వహిస్తున్నా పనులు వేగంగా ముందుకు సాగడంలేదు.