AP CRIME NEWS : ప్రస్తుత రోజుల్లో అందరి చేతుల్లో మొబైల్ ఫోన్ ఉంటుంది. పిల్లల నుంచి పెద్ద వారి వరకు మొబైల్ ఫోన్‌కు సమయాన్ని కేటాయించి మరీ వాడుతుంటారు. ముఖ్యంగా యువత వాటికి బానిసలుగా తయారవుతున్నారు. సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమ్స్ అంటూ.. అర్ధరాత్రి దాటినా మెలకువగా ఉంటూ వారి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. కన్నవారికి కన్నీళ్లు మిగుల్చుతున్నారు. పది మందికి ధైర్యం చెప్పాల్సిన ఓ వైద్య విద్యార్థిని.. తల్లిందండ్రులు మందలించారనే కారణంతో ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. తల్లిందండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చింది.
విద్యార్థిని ప్రాణం తీసిన ఆన్‌లైన్ గేమ్స్ : నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం తురకపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. నెల్లూరులోని ప్రైవేట్ కళాశాలలో బీఫార్మసీ చదువుతున్న విద్యార్థిని ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడింది. తల్లిదండ్రులు ఫీజు కట్టాలని ఇచ్చిన డబ్బుతో ఆన్‌లైన్ గేమ్స్ ఆడింది. అందులో 2.5 లక్షల రూపాయలు పోగొట్టుకుంది.. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కుమార్తెను ఈ నెల 15న మందలించారు. మనస్తాపం చెందిన ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.నెల్లూరు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఈతకు వెళ్లి బాలుడు మృతి :ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో వారి కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శివార్లలోని స్విమ్మింగ్ పూల్‌లో ఈతకు వెళ్లి చరణ్ (12) మృతి చెందాడు. కళ్యాణ దుర్గం గరీబ్ నగర్‌కు చెందిన ఆరో తరగతి విద్యార్థి చరణ్.. తన చెల్లి, తల్లితో కలిసి పట్టణ శివారులో ఉన్న స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లారు. స్విమ్మింగ్ పూల్ రుసుము చెల్లించి ఈత నేర్చుకునే సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లినా ఫలితం లేదని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. స్విమ్మింగ్ పూల్ యజమాని రుసుము వసూలు చేసినా.. సరైన రక్షణ చర్యలు తీసుకోలేదని బాలుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.