నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రిస్తూ, పోలీసులు బారికేడ్లు ఏర్పాట్లు చేయటంతోపాటు.. బయట వ్యక్తులను కార్యాలయంలోకి అనుమతించకుండా నియంత్రిస్తున్నారు. ఈ రోజు నుంచి 30 వరకు నామినేషన్ల ప్రక్రియ సాగనుంది. 31న నామినేషన్ల పరిశీలన, వచ్చేనెల 3వరకు నామినేషన్ల ఉపసంహరణ జరగనుంది. 17న పోలింగ్, మే 2న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. కరోనా దృష్ట్యా ప్రతి 1000 మందికి ఓ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో 17,03,836 మంది ఓటర్లు ఉండగా.. 2468 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి చక్రధర బాబు వెల్లడించారు.