ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేజారుతున్న ఆప్కో స్థలాలు... మూతపడ్డ హీట్ సెట్టింగ్ ప్లాంట్

అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆప్కో.. ఇప్పుడు ఉన్న ఆస్తులను సైతం కోల్పోతోంది. నెల్లూరు జిల్లాలో కోట్లాది రూపాయల విలువైన స్థలం ఆప్కో చేజారుతోంది. నగరంలోని ప్రధాన ప్రాంతంలో ఉన్న ఖరీదైన స్థలాన్ని చేనేత అవసరాలకే వినియోగించాలని నేత సంఘాలు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇతర శాఖలకు ఆప్కో స్థలాన్ని కేటాయించొద్దంటూ ఆ సంస్థ ఉన్నతాధికారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

apco lands are being transferred to other developments in nellore district
చేజారుతున్న ఆప్కో స్థలాలు... మూతపడ్డ హీట్ సెట్టింగ్ ప్లాంట్

By

Published : Oct 3, 2020, 9:48 PM IST

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆప్కో ఆధీనంలో ఉన్న దాదాపు రూ.150 కోట్లు విలువ చేసే స్థలం ఇతర శాఖల ఆధీనంలోకి వెళ్తుండటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని గాంధీనగర్ సమీపంలో ప్రాంతంలో... 6.90 ఎకరాల స్థలాన్ని1978 నాటి ప్రభుత్వం ఆప్కోకు కేటాయించింది. ఈ స్థలంలో నేత వస్త్రాలకు రంగులు, డిజైన్లు అద్దే హీట్ సెట్టింగ్ ప్లాంట్ ను ఆప్కో ఏర్పాటు చేసింది. కాలక్రమంలో హీట్ సెట్టింగ్ ప్లాంట్ మూతపడింది. ఆ స్థలం నిరుపయోగంగా మారింది. భవనం శిథిలావస్థకు చేరి... పిచ్చి మొక్కలు మొలిచాయి. ఉమ్మడి రాష్ట్రంలో కీలక నిర్మాణాలు తెలంగాణలోని హైదరాబాద్​లో చేపట్టగా.. నెల్లూరులోని ఈ స్థలం అలంకారప్రాయంగా మిగిలింది.

రాష్ట్ర విభజన అనంతరం విరివిగా నిర్మాణాలు చేపట్టేందుకు ఆప్కో ముందుకు రావడంతో, ఆ సంస్థ పరిధిలోని స్థలాలు కీలకంగా మారాయి. ప్రస్తుతం అవి కాస్తా ఇతర శాఖల చేతుల్లోకి వెళుతుండటంతో సమస్య ఎక్కువవుతోంది. ఆప్కోకు 6.90 ఎకరాల స్థలం ఉండగా, ఇప్పటికే ఎకరా ఏపీ సీడ్స్ కు, 0.16 సెంట్లు ఇంటెలిజెన్స్ భవన నిర్మాణానికి కేటాయిస్తూ జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. మిగిలిన 5.735 ఎకరాల్లో ప్రస్తుతం మరికొన్ని ప్రభుత్వ శాఖల భవనాలు నిర్మించేందుకు అడుగులు వేస్తున్నారు. 1.10 ఎకరాలు వ్యవసాయ ల్యాబ్ ఏర్పాటుకు, 0.40 సెంట్లు డీఎస్​వో కార్యాలయం, 0.50 సెంట్లు ఆదాయపన్ను జాయింట్ కమిషనర్ కార్యాలయానికి కేటాయించారు. 0.50 సెంట్లు నుడా కార్యాలయం, 1.34 ఎకరాలు రోడ్ల నిర్మాణానికి వినియోగించుకోవాలని నిర్ణయించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన ఓ అధికారి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

అప్పట్లో ఆయా శాఖలు తమకు భూమి అవసరమని అభ్యర్థించినా... ఆప్కో అధికారులు ఎలాంటి నిరభ్యంతర పత్రం ఇవ్వలేదని తెలుస్తోంది. ఈలోపే భవన శిథిలాల తొలగింపు ప్రారంభం కావడం, ఆయా శాఖలు కొత్త భవన నిర్మాణాల దిశగా అడుగులు వేస్తుండటంతో ఆప్కో వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వారం రోజుల క్రితం స్థలం పరిశీలించిన ఆప్కో అధికారులు, ఆ భూమిని చేనేత అవసరాలకే కొనసాగించాలని జిల్లా ఉన్నతాధికారులు కలిసి అభ్యర్థించారు. ఈ మేరకు అమరావతి నుంచి ఆప్కో ఉన్నత వర్గాలు జిల్లా అధికారులకు లేఖ కూడా రాశారు. ప్రస్తుతం ఈ పరిణామాలు వాడివేడిగా మారడం, అగ్రి ల్యాబ్ నిర్మాణానికి కసరత్తులు జరుగుతుండటంతో దీనిపై చర్చ నెలకొంది.

చేనేత జౌళి శాఖ అభివృద్ధికి ఆ స్థలాన్ని కేటాయించాలని నేత సంఘాలు, కార్మికులు కోరుతున్నారు. జిల్లా మంత్రులు ఆప్కో స్థలాన్ని రక్షించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆప్కో భవిష్యత్ అవసరాలకు ఆ స్థలం చాలా అవసరమవుతుందని ఆ సంస్థ అధికారులు అంటున్నారు. ఇతర శాఖలకు ఆప్కో స్థలం కేటాయించవద్దంటూ ఉన్నతాధికారులను కోరుతున్నారు. ఫలితంగా విలువైన ఓ ప్రభుత్వ రంగ స్థలాన్ని చేజిక్కించుకునేందుకు ఇతర శాఖలు ప్రయత్నిస్తుండటం వివాదాస్పదమవుతోంది.

ఇదీ చదవండి:

కృష్ణా నదిలో నలుగురు గల్లంతు.. ఒకరు క్షేమం

ABOUT THE AUTHOR

...view details