నెల్లూరు జిల్లా ఏపీసీడ్స్ అధికారులు రబీ సీజన్‌కు సరిపడా వరి విత్తనాలను సిద్ధంగా ఉంచేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి 8999 క్వింటాళ్లు అందుబాటులో ఉంచగా.. మిగతా విత్తనం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ నుంచి తెప్పించే దిశగానూ కసరత్తు చేస్తున్నారు.
ఏటా రబీలో దాదాపు 6 నుంచి 7 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుండగా.. 3 లక్షల మందికి పైగా రైతులు అందులో భాగస్వాములవుతున్నారు. ఏటా లక్ష క్వింటాళ్ల మేర వరి విత్తనం అవసరమవుతుండగా.. ఇందులో ఏపీసీడ్స్‌కు 20 వేల క్వింటాళ్ల మేర లక్ష్యంగా నిర్దేశిస్తున్నారు. గతేడాదీ 26 వేల క్వింటాళ్లు లక్ష్యంగా నిర్దేశించగా.. దాదాపు 9 వేల క్వింటాళ్లు సరఫరా చేశారు. ఎన్‌ఎల్‌ఆర్-34449 రకం 5 వేల క్వింటాళ్ల మేర పంపిణీ అయ్యింది. ఇక్కడే సమస్య ఏర్పడింది.
భారీగా డిమాండ్
జిల్లా రైతులు గతేడాది రబీలో ఎన్‌ఎల్‌ఆర్-34449 రకం వరి విత్తనానికి భారీగా క్యూ కట్టారు. ప్రధాన సరఫరాదారు ఏపీసీడ్స్ నుంచి పూర్తిస్థాయిలో అందకపోవటంతో సమస్య ఏర్పడింది. చివరకు తెలంగాణ నుంచి యుద్ధప్రాతిపదికన విత్తనాన్ని తెప్పించి అందించేందుకు ప్రయత్నించినా అప్పటికే అదను దాటిపోయింది.