నెల్లూరు జిల్లాలో ఇప్పటికే రబీ సీజన్ ప్రారంభం కావడం వల్ల చాలామంది రైతులు వరి నాట్లు వేశారు. సాగునీరు పుష్కలంగా ఉండటంతో 8 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ప్రతి ఏడాది రాయితీపై రైతులకు అవసరమైన స్ప్రేయర్లు, నాగలి, ట్రాక్టర్స్, రోటవేటర్ వంటి పరికరాలు వ్యవసాయ శాఖ ఇచ్చేది. ప్రస్తుతం సీజన్ ప్రారంభమై 2 నెలలు కావస్తున్నా... నేటికీ వ్యవసాయ శాఖ పరికరాలు ఇవ్వకపోవడం వల్ల... ప్రైవేట్ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. ఈ విధంగా అధిక ధరలకు యంత్రాలు కొంటే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాంకేతిక దన్ను కోసం రైతుల ఎదురుచూపులు..!
పెట్టుబడులు పెరిగిపోయి... గిట్టుబాటు ధర రాక సతమతమవుతోన్న రైతులకు... ఈ రబీ సీజన్ మరింత సమస్యగా మారింది. ప్రభుత్వం అందజేసే పరికరాలను ఇప్పటికీ అధికారులు ఇవ్వకపోవడం వల్ల దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రబీ సీజన్ ప్రారంభమైనప్పటికీ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో... రైతులకు యంత్రాలు అందకపోవడం వల్ల చాలామంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం యంత్ర పరికరాలు పంపిణీ చేయాలని రైతు నాయకులు కోరుతున్నారు. వీటికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాలేదని, వచ్చిన వెంటనే పరికరాలు అందజేస్తామని వివరిస్తున్నారు.
ఇదీ చూడండి: 'పనులు పూర్తయ్యేదెన్నడు? సమస్య తీరేదెన్నడు?'