Yarapatineni fire on Macharla police: ''నిర్బంధాలు ఉన్నచోటే తిరుగుబాటు ఉంటుంది. ఈ విషయాన్ని వైసీపీ నేతలు గుర్తించుకోవాలి. ఆరిపోయే దీపం లాంటి వైసీపీ ప్రభుత్వంతో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి చేయిస్తున్న అఘాయిత్యాలు ఎంతో కాలం సాగవు.'' అని టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. మాచర్ల పట్టణంలో తాజాగా జరిగిన దాడులకు సంబంధించి మాచర్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా ఖండించారు.
టీడీపీకీ చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులను పోలీసులతో పిన్నెలి కొట్టిస్తున్నారని యరపతినేని ఆరోపించారు. తెలుగుదేశం నేతల్ని హింసించే పోలీసులెవ్వరికీ భవిష్యత్తులో ఇక ఉద్యోగాలుండవని స్పష్టం చేశారు. బరితెగించిన మాచర్ల పోలీసుల్ని డీజీపీ అదుపులో పెట్టకపోతే, వారి పరిస్థితి ఇక ఆగమ్యగోచరమేనని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించి ఆయా పోలీస్ స్టేషన్లలో నిర్బంధించిన టీడీపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.