Yarapathineni Comments on YSRCP: మే 28న యుగపురుషుడు, శకపురుషుడు నందమూరి తారక రామారావు శత జయంతి వేళ ఐదు కోట్ల ఆంధ్రా ప్రజలకు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆ పార్టీ నేత యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని వేమగిరిలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో మిని మ్యానిఫెస్టోలో మహిళలకు అనేక సంక్షేమ పథకాలు ప్రకటించారని ఆయన తెలిపారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం జగన్ నాలుగు సంత్సరాల పాలనలో డీఎస్సీ, జాబ్ క్యాలెండరు లేదని ధ్వజమెత్తారు. వైసీపీకి బలం ఉన్న ప్రాంతాల్లో నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.
అకాల వర్షాలు పడి రైతులకు పంట నష్టం కలిగితే కనీసం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఎవరూ క్షేత్రస్థాయికి వెళ్లి రైతులను పరామర్శించి, నష్ట పరిహారం అందేలా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. బీసీ చట్టం తీసుకురావడం భారతదేశంలో టీడీపీ ఘనత అన్నారు. ఇసుక మాఫియా ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. యూనివర్సిటీ, కాలేజీ, స్కూళ్లలో గంజాయి పంపిణీ జరుగుతుందన్నారని విమర్శించారు.
పదవ తేదీ నుంచి భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమాన్ని నియోజకవర్గం నుంచి ప్రారంభం చేస్తున్నట్లు యరపతినేని తెలిపారు. విద్యుత్ బిల్లులు మూడు రెట్లు అధికంగా పెంచారని, రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు, బస్సు ఛార్జీలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవరత్నాలు ఒక్కొక్కటిగా రాలిపోతున్నాయని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో చేసిన పనుల ఫోటోలను ఈ ప్రభుత్వం వాడుకుంటుందని విమర్శించారు. రాజకీయానికి రంగు వేసే పనిలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తాత విగ్రహానికి రంగులు కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నారన్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం జూన్ నెలలో బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తున్నామని ఆయన వివరించారు. జానపాడు అడవిలో అక్రమంగా మట్టి, మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. త్వరలో ప్రభుత్వ భూములను వైసీపీ నాయకులు ఎక్కడెక్కడ ఆక్రమించుకున్నారో వాటిని అన్ని ఆధారాలతో సహా బయటపెడతామని స్పష్టం చేశారు.
సొంత బాబాయి హత్య కేసులో నిందితులను రక్షించడానికి సీఎం జగన్ దిల్లీ వెళ్లి కేంద్రం కాళ్లు మొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. పిడుగురాళ్ల నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలపై త్వరలోనే ఆధారాలు బయట పెడతామని స్పష్ట చేశారు. రాష్ట్ర మ్యానిఫెస్టోతో పాటు నియోజకవర్గంలో ప్రతేక మ్యానిఫెస్టో పెడతామని ఆయన స్పష్టం చేశారు. కౌరవ సభకు రాము.. గౌరవ సభకు వెళ్తామని యరపతినేని శ్రీనివాసరావు వెల్లడించారు.