Case on Prathipati Pulla Rao: తెలుగుదేశం నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదయింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఎన్టీఆర్ సుజల పథకం పునఃప్రారంభం సందర్భంగా జరిగిన ఘటనపై.. ప్రత్తిపాటితోపాటు తెలుగుదేశం నేతలపై చిలకలూరిపేట మున్సిపల్ అధికారి సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రత్తిపాటితోపాటు తెలుగుదేశం నేతలు తనను నెట్టివేశారంటూ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. సునీత ఫిర్యాదు మేరకు.. ప్రత్తిపాటిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. శుక్రవారం నాడు... చిలకలూరిపేట చెరువు వద్ద ఉన్న ఎన్టీఆర్ సుజల ట్యాంకు ప్రారంభించేందుకు ప్రత్తిపాటి సిద్ధంకాగా.. దీనిపై మున్సిపల్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాగునీటి పథకం బోర్లకు అనుమతి లేదంటూ నోటీసులు ఇచ్చారు. ఆయన్ని కారు దిగకుండా అడ్డుకున్నారు.