Cooking Competitions : సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు పట్టణాలకు, సిటీలకు, విదేశాలకు వెళ్లిన వారందరూ సొంత గ్రామాలకు చేరుకుంటారు. ఎక్కడినుంచో సొంత ఇంటికి చేరుకున్న వారితో.. అంతసేపు మూగబోయిన గ్రామాలు సందడిగా మారతాయి. కుటుంబసభ్యులతో ఇల్లంతా కోలాహలంగా ఉంటుంది. బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు తిరిగి స్వగ్రామానికి చేరుకోవటంతో.. ఊరంతా సందడిగా మారుతుంది. చుట్టుపక్కల వారి పలకరింపులు, బంధువుల ఆత్మీయత పండగ వేళ కనిపిస్తుంటుంది. ఇలానే పల్నాడు జిల్లాలోని ఎండుగుంపాలెం గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి.
సంక్రాంతి పండగను పురష్కరించుకుని గ్రామంలో వంటల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి అంటే పిండివంటలు. వీటిలో ప్రావీణ్యం ఉండే మహిళల కోసం ప్రత్యేకంగా.. పండగ వేళ నిర్వహించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిన గ్రామస్థులు.. పండగకు సొంతూరికి తిరిగి రావటంతో ఈ పోటీలను నిర్వహించారు. ఊరు ఊరంతా కలిసి ఈ పోటీలలో పాల్గొనటంతో.. వంటల పోటీలు నిర్వహించిన ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఈ పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని రకరకాల పిండివంటలు చేశారు. సొంతూరిలో వంటల పోటీలో పాల్గొని వంటలు చేయటం ఎంతో ఆనందంగా ఉందని మహిళలు అంటున్నారు. గతంలో మూడు సంవత్సరాల క్రితం కూడా ఇదేవిధంగా పోటీలలో పాల్గొన్నామని మహిళలు అంటున్నారు. గతంలోకంటే ఇప్పుడు గొప్ప అనుభూతిని పొందామని అంటున్నారు.
"మేము హైదరాబాద్లో ఉంటాము. మా ఆత్తగారిళ్లు ఎండుగుంపాలెం. పండగ కోసం మా స్వగ్రామానికి వచ్చాము. సంక్రాంతి సంబరాలను గ్రామాలలో ఎంతో ప్రాముఖ్యంగా నిర్వహిస్తుంటారు. అలాంటి సమయంలో మేము ఈ పోటీలలో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉంది." - పోటీలో పాల్గొన్న మహిళ