ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సత్తెనపల్లిలో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు సన్నాహాలు.. అనుమతులు లేవంటున్న పోలీసులు - సత్తెనపల్లిలో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు సన్నాహాలు

ANNA CANTEENS IN SATTENAPALLI : అన్న క్యాంటీన్లపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను తొలగించిన పోలీసులు.. వేరే ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు సత్తెనపల్లిలో అన్న క్యాంటీన్ల రగడ కొనసాగుతోంది. పట్టణంలోని మూడు ప్రాంతాలలో తెదేపా నాయకులు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టారు. బహిరంగ ప్రదేశాల్లో క్యాంటీన్ల ఏర్పాటుకు అనుమతులు లేవంటూ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

establishments for the anna canteens
establishments for the anna canteens

By

Published : Sep 4, 2022, 2:52 PM IST

Updated : Sep 4, 2022, 6:57 PM IST

ANNA CANTEENS IN SATTENAPALLI : పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మూడు ప్రాంతాల్లో తెదేపా నాయకులు.. అన్న క్యాంటీన్లు ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద ఈనెల 14వ తేదీన తెదేపా నేత అబ్బూరి మల్లి, 15వ తేదీన ఎన్టీఆర్​ భవన్​లో మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, 16వ తేదీన మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు కోడెల శివరాం.. తాలుకా సెంటర్‌లో అన్న క్యాంటీన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.

బహిరంగ ప్రదేశాల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు అనుమతులు లేవంటూ సత్తెనపల్లి పోలీసులు చెబుతున్నారు. బస్టాండ్ సెంటర్‌లో అన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేయకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా... అన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేసి తీరుతామని తెదేపా నాయకులు చెబుతుండటంతో.. పట్టణంలో ఉత్కంఠ నెలకొంది.

TENSION AT ANNA CANTEEN : శనివారం నాడు గుంటూరు జిల్లా తెనాలిలో అన్న క్యాంటీన్‌ను పోలీసులు, అధికారులు తొలగించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఆగస్ట్‌ 12న స్థానిక మున్సిపల్‌ కాంప్లెక్స్‌ వద్ద తెదేపా నేతలు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి.. రోజూ వెయ్యి మంది నిరుపేదలకు ఆహారం అందిస్తున్నారు. నాలుగురోజులుగా ఇదే ప్రాంతంలో వైకాపా నేతలు కూడా అన్నదానం నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని.. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని మున్సిపల్ అధికారులు ఇటీవలే నోటీసులు జారీ చేశారు.

శనివారం తెల్లవారుజామునే వందల మంది పోలీసులు మున్సిపల్ కాంప్లెక్స్ వద్దకు చేరుకుని సమీపంలో ఉన్న దుకాణాల్ని మూసి వేయించారు. అన్నా క్యాంటీన్‌ ఆహార పదార్ధాల ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెదేపా కార్యకర్తలు ఆటోలోని కొన్ని ఆహార పదార్థాలతో మార్కెట్ సమీపంలోని పురవేదిక వద్ద ఆహార పంపిణీ చేపట్టారు. మున్సిపల్ అధికారులు పంపిణీ అడ్డుకునే ప్రయత్నం చేయగా.. తెదేపా శ్రేణులు నిరసనకు దిగాయి. పేదల కడుపు కొట్టొద్దని అధికారుల కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. దాంతో మున్సిపల్ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అదే సమయంలో వైకాపా వారు మున్సిపల్ మార్కెట్ వద్ద అన్నదానానికి యత్నించారు.. అధికార పార్టీ వారికి మాత్రం ఎలా అనుమతిస్తారని పోలీసుల్ని తెదేపా నేతలు నిలదీశారు. మార్కెట్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. దాంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

తెదేపా శ్రేణులు పురవేదిక వద్ద చేస్తున్న ఆహార పంపిణీని పోలీసులు అడ్డుకున్నారు. ఆహార పదార్ధాల్ని లాగి పక్కన పెట్టేశారు. తెదేపా కార్యకర్తల్ని బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వాహనాల్లో ఎక్కించారు. పేదల ఆకలి తీర్చే కార్యక్రమాన్ని అడ్డుకోవద్దని తెదేపా నాయకులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇనుప కంచెలతో పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయగా పలువురు కార్యకర్తలు గాయపడ్డారు.

అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు సన్నాహాలు

పోలీసుల చేతిలో గాయపడిన వారిని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు పరామర్శించారు. పేదలకు అన్నం పెట్టే క్యాంటీన్ ను ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ప్రభుత్వం, అధికారులు ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టినా.. అన్నా క్యాంటీన్ ద్వారా నిరుపేదల ఆకలి తీరుస్తామని తెదేపా నాయకులు తేల్చిచెప్పారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 4, 2022, 6:57 PM IST

ABOUT THE AUTHOR

...view details