Tidco houses distribution program: తెలుగుదేశం హయాంలో అరకొర సౌకర్యాలతో తుతూమంత్రంగా నిర్మించిన టిడ్కో ఇళ్లకు.. పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. పేదల కలకు సాకారం అందించేలా పక్కా ఇళ్లు అందించామని మంత్రి అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో లబ్ధిదారులకు టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. గత టీడీపీ హయాంలో నిర్మించిన 1504 ఇళ్లలో మొదటగా 500 మంది లబ్ధిదారులకు టిడ్కో గృహాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్, మంత్రి ఆదిమూలపు సురేష్. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టిడ్కో చైర్మన్ ప్రసన్న కుమార్, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్, మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడారు. మొదటగా కలెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ పట్టణంలోని పేదలకు సొంతిళ్లు అనేది ఒక కలగా మిగిలిపోయిందన్నారు. ఆ కలను సాకారం చేసేలా ప్రభుత్వం డిడ్కో ఇళ్లను తీర్చిదిద్ది పేదలకు అందించే కార్యక్రమాన్ని చేబట్టి లబ్ధిదారులకు అందించడం జరిగిందని అన్నారు. అయితే నరసరావుపేటలో ఏర్పాటు చేసిన 1504 ఇళ్లలో మొదటగా 500 మంది లబ్ధిదారులకు పక్కా ఇళ్లను అన్ని హంగులతో ఇస్తున్నట్లు తెలిపారు.