Kanna Lakshminarayana comments on Jagan: రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్క అవకాశం అంటూ.. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను నయవంచనకు గురిచేసిందని టీడీపీ నాయకులు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఆదివారం కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆధ్వర్యాన.. వైసీపీ 6వ వార్డు కౌన్సిలర్ గంధం కోటేశ్వరరావు సహా పలువురు కాపు సంఘం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కుట్రలు, కుతంత్రాలతో సానుభూతి పొంది అధికారంలోకి రావడానికి చేసిన దుర్మార్గపు ఆలోచనలు రోజు రోజుకూ తేట తెల్లం అవుతున్నాయని ధ్వజమెత్తారు.
వైఎస్ జగన్.. మూడున్నర సంవత్సరాలుగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాకుండా సహజ వనరులను కొల్లగొట్టి వేలకోట్లు దోచుకున్నారని కన్నా ఆరోపించారు. మరొక పక్క మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఇసుక, మట్టి, మద్యం, మైనింగ్ మాఫియాతో రాష్ట్రాన్ని కొల్లగొట్టారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేతగాక విద్యుత్ చార్జీల పెంపు, ఆస్తి పన్ను పెంపు, చెత్త పన్నులు వేస్తూ ప్రజలపై పన్నుల భారం వేసిందని ఆరోపించారు. సంక్షేమం పేరుతో మరొక వైపు లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతున్నారని విమర్శించారు.