Passengers Problems Due to CM Jagan Meeting: సీఎం జగన్ పర్యటన అంటే.. భద్రతకు అడ్డొచ్చిన చెట్లను నరికివేయడం, అడ్డంగా ఉన్న డివైడర్లను తీసివేయడం, దుకాణాలు మూసివేయడం, రోడ్లకు అడ్డంగా బారికేడ్లు పెట్టి వాహనదారులను దారి మళ్లించడం. తాజాగా సీఎం జగన్ పర్యటన బాధితుల్లో ప్రయాణికులు కూడా చేరారు. ముఖ్యమంత్రి పర్యటన ఉన్న రోజు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిదనే అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆయన పర్యటన ఉంటే.. ప్రజలను తరలించడానికి ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో వేరే ఊరు వెళ్లడానికి ప్రయాణికులు గంటల తరబడి బస్టాండుల్లో వేచి చూస్తున్నారు. గత నెల 26వ తేదీన ముఖ్యమంత్రి గుంటూరు పర్యటన సందర్భంగా ప్రజలను సభకు తరలించడానికి బస్సులు పెట్టారు. దాంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. తాజాగా అలాంటి పరిస్థితే పల్నాడు జిల్లాలో ఎదురైంది.
వినుకొండ నుంచి 30 బస్సులు: పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం క్రోసూరులో నేడు సీఎం జగన్ పర్యటించారు. ఈ నేపథ్యంలో సీఎం సభకు వినుకొండ డిపో నుంచి ఆర్టీసీ బస్సులను పంపారు. దీంతో వినుకొండ నుంచి విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు, యర్రగొండపాలెం, మార్కాపురం, కారంపూడి తదితర ప్రాంతాలతో పాటు నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు వెళ్లేందుకు ప్రయాణికులు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదివారం సాయంత్రం వినుకొండ డిపో నుంచి 30 ఆర్టీసీ బస్సులకు పైగా పెదకూరపాడు ప్రాంతాలకు పంపడంతో రాత్రి నుంచే ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.