Attack on TDP leader: పల్నాడు జిల్లాలో మరో తెదేపా నాయకుడిపై హత్యాయత్నం జరిగింది. రొంపిచెర్ల మండల తెదేపా అధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై ప్రత్యర్థులు గొడ్డళ్లతో దాడి చేశారు. అలవలలో వాకింగ్‌కు వెళ్తున్న బాలకోటిరెడ్డిపై ప్రత్యర్థుల దాడికి పాల్పడగా.. తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆయనను నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
జగన్ ప్రోత్సాహంతోనే రెచ్చిపోతున్నారు: సీఎం జగన్ ప్రోత్సాహంతోనే హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని తెేదపా అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా నుంచి కూడా ప్రతీకార చర్యలు ఉంటే బాధ్యత జగన్ తీసుకుంటారా? లేక పోలీసులా అని ప్రశ్నించారు. బాలకోటిరెడ్డిపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపిన ఆయన.. శాంతిభద్రతల రక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నాయని మండిపడ్డారు. జగన్ ప్రోత్సాహంతోనే వైకాపా కార్యకర్తలు రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. బాలాకోటిరెడ్డికి ఏం జరిగినా జగన్ సమాధానం చెప్పాల్సి ఉంటుందని తెలిపారు.
రాజకీయ ఆధిపత్యం కోసమే హత్యలు..బాలకోటిరెడ్డిపై దాడిని తెదేపా నేతలు ఖండించారు. హత్యలు, దాడులతో తెదేపా కేడర్‌ని భయపెట్టాలనుకుంటున్న జగన్ రెడ్డికి శిశుపాలుడిలా పాపాలు పండిపోయాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ప్రజావ్యతిరేకత తీవ్రం కావడంతో, రాజకీయ ఆధిపత్యం కోసం చేయిస్తోన్న హత్యలు, దాడులే వైకాపా పతనానికి దారులని మండిపడ్డారు. బాలకోటిరెడ్డికి ఏమైనా జరిగితే వైకాపా సర్కారుదే బాధ్యత అని అన్నారు.