Panchayat of YSRCP leaders reached Tadepalli: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీలో ముసలం మొదలైంది. ఎమ్మెల్యే టికెట్ల కోసం వైఎస్సార్సీపీ నేతల మధ్య వర్గపోరులు ప్రారంభమయ్యాయి. ఈసారి తమ వర్గం నాయకుడికే పార్టీ టికెట్ వస్తోదంటూ.. నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రోజురోజుకు వైసీపీ నేతల మధ్య పంచాయితీలు తారస్థాయికి చేరుతుండడంతో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం దృష్టి సారించింది. ఇరువర్గాల నేతలను తాడేపల్లికి పిలిపించుకుని సమస్యలను పరిష్కరించటం ప్రారంభించింది. తాజాగా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ప్రస్తుత మంత్రి చెల్లుబోయిన వేణు వర్గాల మధ్య జరిగిన వర్గపోరు తాడేపల్లికి చేరడం.. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తాడేపల్లికి చేరిన వైసీపీ నేతల వర్గపోరు..అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్, మంత్రి వేణు గోపాలకృష్ణల వర్గపోరు.. దాడులు చేసుకునే స్థాయికి వెళ్లడంతో.. ముఖ్యమంత్రి జగన్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించి.. హితోపదేశం చేశారు. తొలుత సీఎంవో కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, రీజినల్ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డిని కలిసిన బోస్.. ఆ తర్వాత సీఎంతో అరగంటపాటు సమావేశం అయ్యారు. తొలి నుంచీ తనకు అండగా ఉన్న పలువురు శెట్టి బలిజ సామాజికవర్గ నేతలను మంత్రి వేణు వేధిస్తున్నారని సీఎంకు.. బోస్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మంత్రి వేణు ఇసుక దోపిడీ గురించీ వివరణ ఇచ్చినట్లు సమాచారం. వేణు కుమారుడు రాజ్యాంగేతర శక్తిగా మారారనే ఆరోపణలపైనా.. బోస్ వివరించారని తెలిసింది. మున్సిపల్ వైస్ ఛైర్మన్ శివాజీపై మంత్రి వేణు అనుచరుల దాడిపైనా.. సీఎంకు బోస్ ఫిర్యాదు చేశారు. పరస్పర ఆరోపణలు, దాడులపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్.. ఇరువురు నేతలు విభేదాలు వీడి.. ఇకపై కలసి పని చేయాలని సూచించారు. సయోధ్య బాధ్యతను మిథున్ రెడ్డికి అప్పగించారు. త్వరలోనే మంత్రి వేణును కూడా జగన్ పిలిపించే అవకాశాలున్నాయని తెలిసింది.