Water problem in Vijayawada: విజయవాడలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా జక్కంపూడి కాలనీలోని ప్రజల గొంతెండుతోంది. కాలనీలో 50 వేలమంది జనాభా గుక్కెడి నీటి కోసం అల్లాడుతున్నారు. నగరంలో కాల్వగట్లపై నివాసాలు ఉంటున్న వారికి అలాగే ఇళ్లు లేని పేదలకు గత టీడీపీ హయంలో జక్కంపూడిలో ఆధునిక హంగులతో జెఎన్ఎన్ఆర్ఎం ఇళ్లను నిర్మించింది. ఇక్కడ దాదాపు 50 వేల మంది వరకు నివాసం ఉంటున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాలనీ అభివృద్ది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. దాదాపు నెల రోజుల నుంచి తాగునీరు, వాడుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక మహిళలు వాపోతున్నారు. ప్రతి వేసవి కాలంలో నగర పాలక సంస్థ అధికారులు ట్యాంకర్ల ద్వారా ప్రజలకు మంచినీటిని అందించేవారని.. ఇప్పుడు అది లేదని మహిళలు చెబుతున్నారు. వృద్దులు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడే వారి కష్టాలు వర్ణించలేని విధంగా ఉన్నాయి.
దాహర్తిని తీర్చాలని నగర పాలక సంస్థ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా.. ఫలితం లేదని వారు వాపోతున్నారు. తమ సమస్యలు తీర్చుతారని ఓట్లెసి ఎన్నుకున్నామని కానీ వైసీపీ ప్రజా ప్రతినిధులు తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కాలనీలో 24 బ్లాక్‌లు ఉండగా ఒక్కొ బ్లాక్‌కు కనీసం 10 కుటుంబాల వరకు ఉంటాయి. మంచినీరు లేక వీరంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాడుకోవడానికి కూడా నీళ్లు లేకపోవడంతో పిల్లలకు సరిగా స్నానాలు కూడా కూడా చేయించడం లేదని చెబుతున్నారు. తాగేందుకు బాటిల్ 20 రుపాయాలు చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తుందని.. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు మావి రోజు అన్ని రుపాయాలు పెట్టి మంచినీళ్లు కొనుగోలు చేయాలంటే తమకు తలకు మించిన భారంగా మారుతుందని ఆవేదన చెందుతున్నారు.
కృష్ణా, గోదావరి పక్కనే ఉన్నా..వేసవిలో నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాలనీలో అదనంగా బోర్లు వేయాల్సిన అవసరాలున్నాయి. కొన్ని చోట్ల కొత్తగా పైపు లైన్లు వేస్తే నీటి సమస్యలకు కొంత ఉపసమనం కలుగుతుంది. టీడీపీ ప్రభుత్వం మంచి ఆలోచనతోనే తమకు నివాసాలను ఏర్పాటు చేసినా వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తాము అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు. వేసవి సెలవుల కావడంతో పిల్లలు ఇంటికి వస్తే నీరు లేకపోవడంతో వారు తర్వాత రోజే తమ ఇంటి నుంచి వెళ్లిపోతున్నారని మహిళలు చెబుతున్నారు. మంచినీళ్లు కావాలంటే డబ్బులు ఇచ్చి ట్యాంకర్ ద్వారా కొనుక్కొవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఒక వైపు కృష్ణా నది.. మరోక వైపు గోదావరి పక్కనే ఉన్నా కూడా తాము గుక్కెడు నీటి కోసం అల్లాడాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం కాలువ ద్వారా తమకు నీరు అందించాలని కోరుతున్నారు. అవసరమైతే తమపై పన్నులు వేసి పోలవరం కాలువ నుంచి తమకు తాగునీరు ఇవ్వాలని వారు అంటున్నారు. ఎన్నికల సమయంలో తమ వద్దకు వస్తున్నారు తప్ప మిగిలిన రోజుల్లో తమను అస్సలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంచినీటి ట్యాంక్‌లో విషం కలిపి చంపేయండి..తమకు కష్టం అని చెపితే టీడీపీ నాయకులు మాత్రం వచ్చి తమ ఇబ్బందులను పరిష్కరిస్తున్నారని.. వైసీపీ నేతలు వచ్చిన దాఖాలాలు లేవని చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఒక్కరోజు కాలనీలో ఉంటే తమ బాధలు తెలుస్తాయని అన్నారు. జక్కంపూడి కాలనీలో సమస్యలు పరిష్కరించడం చేతకాకపోతే మంచినీటి ట్యాంక్‌లో విషం కలిపి తమను చంపేయాలని మహిళలు వాపోతున్నారు. మంచినీటి కోసం అల్లాడుతూ తాము బతకలేమని అంటూన్నారు. కింద నుంచి నాలుగ అంతస్తుకు నీటి బిందేలు మోసుకుని వెళ్లాలంటే తమకు ఎంత కష్టంగా ఉంటుందని మహిళలు అవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందిచకుంటే రానున్న ఎన్నికల్లో జక్కంపూడి కాలనీ అంటే ఏంటో చూస్తారని హెచ్చరిస్తున్నారు.
పక్కనే కృష్ణా.. మరో వైపు గోదావరి.. కాని తాగునీరు లేక దాహం కేకలు ఇవీ చదవండి: