Brahmotsavam celebrations start on April 1: సర్వశక్తిస్వరూపిణి, జగన్మాత కనకదుర్గమ్మ కొలువైన విజయవాడ ఇంద్రకీలాద్రి బ్రహ్మోత్సవ కల్యాణ మహోత్సవాలకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు దుర్గామల్లేశ్వరస్వామి వారికి బ్రహోత్సవ కల్యాణం ఆగమోక్తంగా జరగనుంది. ఈనెల 22న ప్రారంభమైన వసంత నవరాత్రోత్సవాలు రేపటితో ముగియనున్నాయి. శ్రీరామనవమిని పురస్కరించుకుని ధర్మపథం కల్యాణ వేదిక వద్ద సీతారాముల కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు దంపతులు, పాలక మండలి సభ్యులు, ఈవో ధర్బముళ్ల భ్రమరాంబ, వైదిక కమిటీ సభ్యులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు తరలివచ్చారు. వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి కనకాంబరాలు, ఎర్రగులాబీలతో ప్రత్యేక పూజ చేశారు.
రేపు ఉదయం 10 గంటలకు పూర్ణాహుతితో వసంత నవరాత్రి ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. ఉదయం 11 గంటలకు శ్రీరాముల పట్టాభిషేకాన్ని నిర్వహించనున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి దుర్గామల్లేశ్వరస్వామి బ్రహోత్సవ కల్యాణ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు మంగలస్నానాలు, వధూవరులుగా ఆదిదంపతుల అలంకరణ, సాయంత్రం విఘ్నేశ్వరపూజ, అంకురార్పణ, ధ్వజారోహనం ఉంటాయి. ఏప్రిల్ రెండో తేదీ నుంచి ఐదో తేదీ వరకు మూల మంత్ర హవనాలు ఇతర కార్యక్రమాలు జరగనున్నాయి. మూడో తేదీ ఉదయం ఎదుర్కోలు ఉత్సవం, రాత్రి పదిన్నర గంటలకు దివ్య కల్యాణం జరగనుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు ఒక్కో వాహనంపై నగరోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. ఒకటో తేదీన వెండి పల్లకీసేవ, రెండో తేదీ రావణ వాహన సేవ, మూడో తేదీ నందివాహన సేవ, నాలుగో తేదీ సింహవాహన సేవ, ఐదో తేదీ వెండి రథోత్సవం జరగనున్నట్లు దుర్గగుడి స్థానాచార్యులు విష్ణుభొట్ల శివప్రసాదశర్మ వెల్లడించారు.