Bhavani Island in AP: నిత్య కల్యాణం పచ్చ తోరణం లాగా పర్యాటకులతో కళకళలాడుతుండే భవానీ (ద్వీపం) ఐలాండ్ ప్రస్తుతం వెలవెలబోతోంది. పర్యాటకులతో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ ఐలాండ్ ప్రస్తుతం పాలకులు పట్టించుకోక అనాధరణకు గురవుతోంది. ఆదాయం తెచ్చే భవానీ ఐలాండ్‌న్ని పట్టించుకోకపోవడంతో ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని కోల్పోతోంది. మూడు నెలల నుంచి భవానీ ఐలాండ్ మూసే ఉండటంతో పర్యాటకులు నిరాశతో వెనుతిరుగుతున్నారు. కృష్ణనది అందాలను తిలకిస్తూ భవానీ ఐలాండ్ చేరుకోవడం అంటే పర్యాటకులు ఎంతో ఇష్టపడతారు. సాధారణ రోజుల్లో రోజుకు రెండు నుంచి మూడు వేల మంది భవానీ ఐలాండ్ సందర్శిస్తుంటారు. ఆదే వారంతపు రోజులైన శని, ఆది వారాల్లో అయితే 5 వేల మంది మంది వరకు ఈ ఐలాండ్‌న్ని సందర్శిస్తారు.
విజయవాడలో ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో విజయవాడ భవానీ ఐలాండ్ ప్రముఖమైనది. ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చిన వారు అలాగే దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు తప్పని సరిగా భవానీ ఐలాండ్ సందర్శిస్తారు. కుటుంబంతో సంతోషంగా ఇక్కడ గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు. భవానీ ఐలాండ్‌లో సభలు, సమావేశాలు, శుభకార్యాలు చేసుకోవడానికి వీలుగా పర్యాటక శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. నదికి వరదలు వస్తున్న నేపథ్యంలో నది విహారానికి అవకాశం లేకపోవడంతో పర్యాటకులు ఉసూరుమంటున్నారు.