Govt Released Guidelines For Teachers Principals Transfers : ప్రధానోపాధ్యాయుల, ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల బదిలీల్లో పోస్టులను బ్లాక్ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాల్లో ఖాళీలు ఎన్ని ఉన్నా సరే పని చేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య మేరకే పోస్టులు చూపనున్నారు. పట్టణ, నగరాల సమీపంలోని కేటగిరీ 1, 2, 3 పోస్టులను బ్లాక్ చేయనున్నారు. ప్రభుత్వం సోమవారం జారీ చేసిన మార్గదర్శాకల్లో ఈ మేరకు ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను పేర్కొంది. గత సంవత్సరం ఆగస్టు నెల 31 నాటికి పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా చేసుకుని పోస్టులను నిర్ణయిస్తారు.
ఇవి హేతుబద్ధీకరణకు గతసంవత్సరం విడుదల చేసిన ఉత్తర్వులు 117, 128 ప్రకారం ఉండనున్నాయి. హేతుబద్ధీకరణతో సబ్జెక్టు టీచర్లు, 3, 4, 5 తరగతుల విలీనం, విద్యార్థుల సంఖ్య ఆధారం చేసుకుని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ పోస్టులను కేటాయించారు. ఆ సంఖ్యనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ నెల 31 నాటికి ఏర్పడే ఖాళీలను బదిలీలకు చూపుతారు. జిల్లా విద్యా శిక్షణ సంస్థ-డైట్‌ల్లోనూ బదిలీలు నిర్వహిస్తారు.