CM review of the Odisha train accident incident: ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్ జిల్లాలో గతరాత్రి జరిగిన ఘోర రైళ్ల ప్రమాదంపై.. ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అటు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా తీవ్ర అవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో మృతుల కుటుంబాలు గుండె ధైర్యం కోల్పోరాదంటూ.. పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రలను ఆదుకునేందుకు అందరు సహకరించాలని వారు సూచించారు.
ఒడిశా రైళ్ల ప్రమాదంపై సీఎం సమీక్షా..సమీక్షలో భాగంగాఒడిశాలో జరిగిన రైళ్ల ప్రమాదంలో ఎంతమంది మృతి చెందారని సీఎం జగన్..అధికారులను అడుగగా.. తాజా సమాచారం ప్రకారం 237 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వివరించారు. అనంతరం రైళ్ల ప్రమాద ఘటనపై తీసుకున్న చర్యలను అధికారులు సీఎంకు తెలియజేశారు. ప్రమాద ఘటన జరిగిన ప్రాంతం పరిధిలోని డీఆర్ఎం అధికారి నుంచి సమాచారం తెప్పిస్తున్నామని.. ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో కూడా నిరంతరం టచ్‌లో ఉన్నామని అధికారులు వెల్లడించారు.
అంబులెన్స్‌లు పంపించండి.. సీఎం జగన్ మాట్లాడుతూ.. పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ఒక బృందాన్ని ప్రమాదం జరిగిన బాలేశ్వర్ ప్రాంతానికి పంపించాలన్నారు. ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కూడా ఎంక్వైరీ విభాగాలను ఏర్పాటు చేయాలన్నారు. రైల్వే అధికారుల నుంచి అందిన ప్రయాణికుల పరిస్థితులపై ఆరా తీయడానికి, అలాగే ఎవరైనా ప్రయాణికుల బంధువులు, వారి సంబంధీకుల నుంచి సమాచారం వస్తే వెంటనే స్పందించేలా ఈ ఎంక్వైరీ విభాగాలు పని చేసేలా చర్యలు తీసుకొవాలన్నారు. దీంతోపాటు ఒడిశా సరిహద్దులకు సమీపంగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తదితర జిల్లాల్లో అవసరమైన పక్షంలో అంబులెన్స్‌లను పంపించడానికి సిద్ధంగా ఉంచాలని.. క్షతగాత్రులకు అవసరమైన పక్షంలో ఉత్తమ వైద్యం అందించడానికి విశాఖ సహా ఒడిశా సరిహద్దుల్లోని ఆస్పత్రులను సన్నద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు. స్పందించిన అధికారులు.. మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తోపాటు సివిల్ సప్లై కమిషనర్ అరుణ్ కుమార్, విశాఖలో కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ ఆనంద్, శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ నవీన్‌లతో కూడిన బృందం వెళ్తోందని సీఎంకు తెలిపారు.