Temperature due to climate change: వేసవి ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటి నమోదు అవుతున్నాయి. ఏపీలో రికార్డు స్థాయిలోనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్టు వాతావరణశాఖ స్పష్టం చేస్తోంది. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలమేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్టు ఐఎండీ చెబుతోంది.
ఏపీలో తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. వేసవి ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు దరిదాపుల్లోనే నమోదు అవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండల తీవ్రత పెరిగిపోతుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రస్తుతం సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నట్టు భారత వాతావరణ విభాగం చెబుతోంది. మరో 5 రోజుల పాటు ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశాలున్నట్టు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల 40 డిగ్రీలను మించి ఉష్ణోగ్రత నమోదు అవుతోంది.
గరిష్టంగా విజయనగం జిల్లా గుర్లలో 41.83 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది, నంద్యాలలోని ఆత్మకూరులో 41.7, ఏలూరు జిల్లా పూళ్ల వద్ద 41.11, బాపట్లలో 41.6, ప్రకాశం జిల్లా గోస్పాడులో 41.8, జంగారెడ్డి గూడెంలో 41.65, అనకాపల్లిలో 41.62, కురిచేడులో 41.5, నెల్లూరులో 41.4, నంద్యాలలో 41.2, సత్యసాయి జిల్లాలో 41.29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. విజయవాడలో 38.1, తిరుపతిలో 40.7, కడపలో 38.3, ఒంగోలులో 39.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది.