TDP LEADERS ON PAWAN AND CBN MEETING : చంద్రబాబు, పవన్కల్యాణ్లది కృష్ణార్జునుల కలయిక అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. వైకాపా విధ్వంసానికి ముగింపు పలికేందుకే తెదేపా, జనసేన కలిసి పోరాడాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దేవుడి రథంపైకి కూడా చెప్పులు రాళ్లు విసిరే నీచానికి వైకాపా నేతలు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. దైవభక్తితో పాటు మానవత్వం కూడా వైకాపాకు లేదనే విషయం ప్రజలకు అర్థమైందని దుయ్యబట్టారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు పవన్ కలవడం శుభపరిణామం: ఏపీలో జగన్ పతనం ప్రారంభమైందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. తెదేపా కార్యాలయంపై దాడి, మాజీమంత్రుల అక్రమ అరెస్ట్, తెదేపా నేతలను హత్య చేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు పవన్ కలిసి రావడం శుభపరిణామమని తెలిపారు. ఎన్నికలప్పుడు పొత్తులపై పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.
అక్రమ కేసులు పెట్టడం వైకాపా కక్ష సాధింపు చర్యలు : ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజల సమస్యల కోసం తెలుగుదేశం పార్టీతో జనసేన కలిసి పనిచేయడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని మాజీ మంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు తెలిపారు. విశాఖలో జనవాణి కార్యక్రమానికి విచ్చేసిన పవన్‌కల్యాణ్‌ను చూడడానికి వచ్చిన కార్యకర్తలను, అభిమానులను అడ్డుకోవడమే కాకుండా వారిని నిర్బంధించి అక్రమ కేసులు పెట్టడం కేవలం వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలేనన్నారు. వైకాపా ప్రభుత్వ ఏడుగురు మంత్రుల మూకుమ్మడి దాడిని ఖండిస్తున్నామన్నారు. మంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు మొత్తం అరాచకాలు సృష్టిస్తూ ప్రశ్నించేవారి గొంతు నొక్కడమే కాకుండా అక్రమ కేసులతో నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు.