Jaggayyapeta TDP Councilors Arrest : ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కౌన్సిలర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో.. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లో నగరపాలక సంస్థ అనుమతి లేకుండా మాజీ సర్పంచ్ విగ్రహం ఎలా ఏర్పాటు చేస్తారని టీడీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వారు సమావేశంలో నేలపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ క్రమంలో సమావేశంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో కౌన్సిల్ సమావేశానికి ఆటంకం కలిగిస్తున్నారని నగర పాలక ఛైర్మన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు టీడీపీ కౌన్సిలర్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. తమపై వైసీపీ కౌన్సిలర్లు దాడి చేశారని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపించారు. వైసీపీ పాలక పక్షం చర్యలను టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరామ్ తాతయ్య ఖండించారు.
పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించిన తర్వాత కూడా టీడీపీ కౌన్సిలర్లు తమ నిరసనను కొనసాగించారు. స్టేషన్కు తరలించిన తర్వాత టీడీపీ కౌన్సిలర్లు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. చట్ట వ్యతిరేకంగా పోలీసులు కౌన్సిల్ సమావేశంలోకి ప్రవేశించారని కౌన్సిలర్లు అన్నారు. పోలీసులు కౌన్సిల్ సమావేశంలో వచ్చిన వీడియోలను న్యాయస్థానంలో ప్రవేశపెడతామని వారు తెలిపారు.