STORY TELLERS INTERVIEW : చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ కథలంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. కానీ నేటీ సమాజంలో పెద్దలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే.. పిల్లలు మాత్రం ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకుల పరుగుల జీవితం అలవాటై పిల్లలతో సమయం కేటాయించలేకపోతున్నారు. కనీసం పాఠశాలల్లో అయినా పిల్లలకు విజ్ఞానపరమైన కథలు చెబుతారా అంటే అది కూడా కష్టమే. కేవలం ర్యాంకుల కోసం మాత్రమే పోటీపడేలా వారిని తయారు చేస్తున్నారు.
కథలు చిన్నారుల జీవితాలను చాలా వరకు ప్రభావితం చేస్తాయనేది అందరికీ తెలిసిందే. కానీ కాలంతో పాటు మారుతున్న పరిస్థితులు.. పిల్లలను కథలు వినేందుకు చదివేందుకు దూరం అయ్యేలా చేస్తున్నాయి. ఎప్పుడూ స్మార్ట్ఫోన్లు, వీడియో గేమ్‌లు, ఇంటర్నెట్‌లతో కాలం గడిపే చిన్నారుల్లో సృజనాత్మక శక్తి పూర్తిగా తగ్గిపోవడంతో పాటు ఊబకాయం తదితర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ప్రబలే అవకాశం ఉందని అనేక సర్వేలు ఇప్పటికే వెల్లడించాయి. అయితే ఈ ఇద్దరు మిత్రులు మాత్రం "మీ పిల్లలు తెలివైన వాళ్లు కావాలంటే వారికి రోజూ కథలు చెప్పండి" అని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్పిన మాటలనే ఉపాధిగా ఎంచుకున్నారు ఈ ఇద్దరు స్నేహితులు..
స్టోరీ టెల్లింగ్.. కథలు చెప్పడం అనేది ప్రతి వ్యక్తికి చిన్నతనం నుంచి ఉండే విద్య. కొందరు దానికి సృజనాత్మకతను జోడించి డబ్బులు సంపాదిస్తుంటే.. మరి కొందరు దానిని తేలిగ్గా తీసుకుంటుంటారు. దశాబ్ధాల క్రితం వరకు ప్రతి చిన్నారికి తన నాన్మమ్మ, తాతయ్యలు కచ్చితంగా కథలు చెప్పేవాళ్లు. కానీ ఉరుకుల పరుగుల నేటి కాలంలో మంచి కథలతో పాటు, కథలు చెప్పే వాళ్లు కనిపించడం లేదు. నగర జీవితంలో కుటుంబాలు చిన్నవైపోవడం.. నాన్మమ్మ, తాతయ్యలు పిల్లల దగ్గర ఉండే పరిస్థితులు లేకపోవడం.. తమ జీవన యానంలో పడిపోయిన తల్లిదండ్రులు పిల్లలకు కథలను చెప్పగలిగేంత సమయం, ఓపిక దొరక్కపోవడం వంటివి కారణాలుగా ఉంటున్నాయి. అయితే స్టోరీ టెల్లింగ్ అనేది చాలా తేలికైన విషయం కాదు. ఈ విభాగంలో ఇప్పుడు అనేక నిపుణులు తయారవుతున్నారు. మహానగరాలతో పాటు విద్యా సంస్థలకు ఈ నిపుణులు వెళ్లి కథలు చెప్పడమే వ్యాపకంగా పని చేస్తున్నారు.
బాలోత్సవాలు, పుస్తక మహోత్సవాలు వంటి ఎక్కువ మంది జనసమర్దత ఉండే చోట్ల కూడా కథ చెబుతా.. ఊ కొడతారా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కథల ద్వారా పరిచయమైన ఇద్దరు మిత్రులు ఇదే వ్యాపకానికి తమ సృజనను జోడించి.. చిన్నారులకు వారికి ఇష్టమైన భాషలో సంక్షిప్తంగా.. సరళంగా కథలు చెబుతూ వారిని ఉత్సాహపరుస్తున్నారు. గత నెల ఫిబ్రవరిలో జరిగిన పుస్తక మహోత్సవంలో ఇద్దరు మగువలు మేఘన, హరిప్రియలు స్టోరీ టెల్లింగ్‌ని ఉపాధిగా మార్చుకుని విజయం సాధిస్తున్నారు. వారి విజయగాథను వారి మాటల్లోనే విందాం.