Sankata Chaturdashi celebrations onIndrakeeladri:విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నూతన ఆర్జిత సేవగా... సంకటహర గణపతి హోమం ఏర్పాటు చేశారు. ప్రతినెల సంకట చతుర్దశి రోజున అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీగణపతి ఏకశిలా విగ్రహం వద్ద హోమం నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. ఇవాల్టి నుంచి సంకట హర గణపతి హోమం ఆర్జిత సేవగా ప్రారంభించారు. ప్రతిరోజు గణపతి హోమం ఆలయంలో జరుగుతున్నా... ప్రత్యేకంగా ఏకశిల గణపతి ఎదురుగా యాగశాలలో హోమం నిర్వహించే ఏర్పాటును తొలిసారిగా చేశారు.
భక్తులు ఆర్జితసేవగా వెయ్యి రూపాయల టిక్కెట్టు కొనుగోలు చేసి పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఈ హోమంలో ఆలయ పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబ, స్థానాచార్యులు విష్ణుభొట్ల శివప్రసాదశర్మ, పాలక మండలి సభ్యులు బుద్దా రాంబాబు, కట్టా సత్తయ్య, కేసరి నాగమణి తదితరులు పాల్గొన్నారు. గణపతి అభిషేకం, గణపతి మంత్ర హవనాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాధారణ భక్తులను కూడా హోమం తిలకించేందుకు అనుమతించారు. అనంతరం తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈ హోమం చేయించుకున్న ఉభయదాతలకు శేషవస్త్రం, రవితోపాటు పెద్ద లడ్డూ, ఉండ్రాళ్లను ప్రసాదంగా అందజేస్తామని ఈవో భ్రమరాంబ తెలిపారు. ప్రత్యేక క్యూలైను మార్గం ద్వారా అమ్మవారి దర్శానికి అనుమతిస్తామన్నారు.