Problems In Tribal village: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం గద్దమడుగు. 200మందికి పైగా నివసిస్తున్న ఈ గ్రామం.. 30ఏళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రానికి వలసొచ్చింది. అప్పట్లో ఇక్కడ ఉంటానికి వీల్లేదంటూ అటవీశాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ ఉండేవారు. దీంతో వీరంతా హైకోర్టును ఆశ్రయించగా.. 2002లో ఇక్కడే నివసించేందుకు అనుకూలంగా న్యాయస్థానం తీర్పునిచ్చింది. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో పోడు భూములను సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో దేవుడిపై భారం:చూడటానికి ఈ గిరిజనులు ఈ ప్రాంతంలో జీవిస్తున్నా అడుగడుగునా సవాళ్ల మధ్య బతుకులీడుస్తున్నారు. గద్దమడుగు రాకపోకలకు సాగించాలంటే వాగులో నుంచి ప్రయాణం చేయాలి. సాధారణంగానే బయటి ప్రాంతంతో అంతంత మాత్రంగా ఉండే సంబంధాలు.. వర్షం వచ్చిందంటే పూర్తిగా నిలిచిపోతాయి. సమీపంలో వైద్య సౌకర్యాలు లేక అత్యవసర పరిస్థితుల్లో దేవుడిపై భారం వేయక తప్పదు. పురిటి నొప్పుల వేళ పలువురు మహిళలను తరలించే క్రమంలోనే మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నారు.
వేరే రాష్ట్రం నుంచి వలస వచ్చారనే కారణం: వేరే రాష్ట్రం నుంచి వలస వచ్చారనే కారణంతో అధికారులు ఇప్పటివరకు ఈ గ్రామస్థులకు కులధ్రువీకరణ పత్రాలు జారీ చేయటంలేదు. గ్రామంలోని ఓ పూరిగుడిసెలో పిల్లల కోసం అంగన్‌వాడీ ఏర్పాటు చేశారు. దగ్గరలో విద్యాసౌకర్యం లేకపోవటంతో పిల్లలు చదువులకు దూరమై.. అడవులకే పరిమితమవుతున్నారు. ఏళ్ల తరబడి అటవీ ప్రాంతంలో సాగుచేసుకుని జీవిస్తున్న ఇక్కడి గిరిజనులకు పోడు భూముల పట్టాల విషయంలోనూ సందిగ్ధత నెలకొంది.