దేశాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ది అసాధారణ భాగస్వామ్యం కావాలని... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. ఎన్నో విశిష్టతలకు ఆంధ్రప్రదేశ్ నెలవని అన్నారు. రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన ద్రౌపదీ ముర్ముకు ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ప్రభుత్వం తరఫున పౌర సన్మానం నిర్వహించింది.
రెండ్రోజుల పర్యటన కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రానికి వచ్చారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్.. స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా విజయవాడ పోరంకికి ముర్ము చేరుకున్నారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన పౌర సన్మానాన్ని ఆమె స్వీకరించారు. గవర్నర్ బిశ్వభూషణ్ .. రాష్ట్రపతిని సత్కరించి మెమొంటో అందజేశారు. సీఎం జగన్ వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని ద్రౌపదీ ముర్ముకు అందించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కూడా రాష్ట్రపతిని సత్కరించారు.
తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము... వెంకటేశ్వరస్వామి నెలవైన పవిత్ర స్థలానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాష్ట్ర విశిష్టతలను కొనియాడారు. గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి వంటి నదులు రాష్ట్రాన్ని పునీతం చేశాయన్న రాష్ట్రపతి.. నాగార్జున కొండ, అమరావతి ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయని ప్రశంసించారు. రాష్ట్రానికి చెందిన కూచిపూడి నృత్యం దేశవ్యాప్త ఖ్యాతి గడించిందన్న ఆమె, తెలుగు భాష, సాహిత్యం దేశ ప్రజలందరికీ సుపరిచితమేనని గుర్తు చేశారు. రాష్ట్రం నుంచి జాతీయస్థాయిలో వివిధ పదవులు అలంకరించిన నేతలు చేసిన కృషిని శ్లాఘించారు. రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య పోరాట యోధుడు అల్లూరితో పాటు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యను గుర్తుచేసుకున్నారు.
ఏపీ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోందని గవర్నర్ హరిచందన్ చెప్పారు. రాష్ట్రంలో 60 శాతం మంది సాగుపై ఆధారపడి ఉన్నారన్న గవర్నర్.. మేజర్ ఎడ్యుకేషన్ హబ్‌గా రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. తెలుగు.. రాష్ట్ర అధికార భాష. ఆరు ప్రాచీన భాషల్లో తెలుగు ఒకటి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 96 మిలియన్ల ప్రజలు తెలుగు భాషను మాట్లాడుతున్నారు. దేశ భాషల్లో తెలుగు భాష తియ్యనైనదని.... విఖ్యాత రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ కొనియాడారు. ప్రపంచ ప్రఖ్యాత దేవాలయాలు, చారిత్రక వారసత్వానికి ఆంధ్రప్రదేశ్ వేల సంవత్సరాల క్రితమే నెలవైంది. యాత్రికులు, పర్యాటకులకు ఎంతో మధురమైన అనుభూతిని అందిస్తోందని అన్నారు.
దేశ చరిత్రలో తొలిసారి గిరిజన మహిళ రాష్ట్రపతి పదవి చేపట్టారని గుర్తు చేసిన సీఎం జగన్.. మహిళా సాధికారితకు ముర్ము నిదర్శనమన్నారు.. ప్రతి మహిళ... రాష్ట్రపతిలా స్వయం సాధికారత సాధించాలని ఆకాంక్షించారు.
పౌరసన్మానం అనంతరం రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి గౌరవార్ధం గవర్నర్ ఏర్పాటు చేసిన విందుకు... ద్రౌపదీ ముర్ము హాజరయ్యారు. సీఎం జగన్ దంపతులతో పాటు హైకోర్టు సీజే, మంత్రులు, ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు. విందులో పాల్గొన్నారు. తొలిసారి రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతిని తెలుగుదేశం నేతలు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
తెలుగు భాష, సాహిత్యం గురించి దేశ ప్రజలందరికీ తెలుసు. దేశ భాషలందు తెలుగు లెస్స. దేశంలోని అన్ని భాషలకన్నా తెలుగు శ్రేష్టమైనది. ఇందులో భారతీయ భాషల ఔన్నత్యం తెలుస్తోంది. కవిత్రయం.... నన్నయ, తిక్కన, ఎర్రన్న భారతీయ భాషల గొప్పదనానికి ప్రతీక. భారతీయ భాషల గొప్పదనం కాపాడే దిశగా జాతీయ విద్యా విధానం 2020 రూపొందించారు. ఐటీ, సాంకేతిక రంగాల్లో ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారత ప్రతిష్ఠను పెంచారు. ఆంధ్ర ప్రదేశ్ వాసులు భారత ప్రగతిలో అసాధారణ భాగస్వామ్యం పంచుకుంటారని విశ్వసిస్తున్నా. ఆంధ్రప్రదేశ్‌లోని సోదరసోదరీమణులు, పిల్లందరిది బంగారు భవిష్యత్ కావాలని కోరుకుంటున్నా. భారత వికాసంలో ఆంధ్రప్రదేశ్.. భాగస్వామ్యం పెద్దఎత్తున ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. -ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి
ఇవీ చదవండి: