Problems of Pensioners in Andhra Pradesh: విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కుతున్నారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వహించినా తమను ప్రభుత్వం విస్మరిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పెన్షన్ సకాలంలో ఇవ్వట్లేదని.. దీంతో పలు ఇబ్బందులకు గురవుతున్నామని పెన్షనర్లు చెబుతున్నారు.
పెన్షనర్ల సమస్యలపై విజయవాడలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన రౌండ్ సమావేశంలో పలు సంఘాల అసోసియేషన్ నేతలు మాట్లాడారు. వృద్ధాప్యంలో పెన్షన్.. విశ్రాంత ఉద్యోగులకు జీవనాధారం. పెన్షన్ సకాలంలో ఇవ్వకపోవటంతో కుటుంబ పోషణ భారంగా మారుతుందని చెబుతున్నారు. అనారోగ్య సమస్యలకు అండగా ఉండే హెల్త్ కార్డ్ చాలా ఆసుపత్రుల్లో పనిచేయట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తరచుగా ఆసుపత్రికి వెళ్లి వైద్యం తీసుకోవాల్సిన పరిస్థితుల్లో చాలా మంది పెన్షనర్లు ఉన్నారని చెబుతున్నారు. ధీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నా.. పెన్షనర్లు ఆసుపత్రులకు వెళితే వైద్యానికి అయ్యే ఖర్చును చెల్లించి.. రీఇంబర్స్‌మెంట్‌ను పెట్టుకోవాలని ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారని అసోసియేషన్ నేతలు చెబుతున్నారు.
లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని.. పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 11వ పీఆర్సీలో 27 శాతం ఫిట్ మెంట్ ఇస్తానని చెప్పి 23 శాతం ఫిట్ మెంట్ ఇవ్వటం చరిత్రలో ఇదే మొదటి సారని చెబుతున్నారు. 12వ పీఆర్సీకి కమిటీ వేయాల్సిన సమయం వచ్చినా.. గత పీఆర్సీలో కోల్పోయిన 4 శాతంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని నిలదీస్తున్నారు.
విశ్రాంత ఉద్యోగుల మందులకు నెలసరి ఖర్చు వేల రూపాయలు అవుతుందని చెబుతున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు పెన్షనర్లను కించపరుస్తూ మాట్లాడటం సరికాదని సంఘాల నేతలు తెలిపారు. సీపీఎస్‌ను రద్దు చేస్తానని చెప్పిన ప్రభుత్వం.. మాట తప్పిందని ఆరోపిస్తున్నారు. భవిష్యత్‌లో పదవీ విరమణ చేసే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ లేకపోవటం దారుణమని అన్నారు. సీపీఎస్ రద్దు కోసం మే 1న విశాఖలో చేపట్టిన ఉద్యమానికి పలు సంఘాలు తమ మద్దతును తెలిపాయి.
"ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పెన్షనర్లు ఎదుర్కొంటున్న వేతనలు, కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సుమారు 40 సంవత్సరాలు ప్రభుత్వ సేవలో, ప్రజల సేవలో అహర్నిశలు పని చేసి.. రెస్ట్ తీలుకోవలసిన సమయంలో.. పెన్షనర్లు అందరూ కూడా.. పెన్షన్ ఎప్పుడు వస్తాది అనే బెంగ అందరినీ వేధిస్తోంది. ముఖ్యంగా ప్రతీ పెన్షర్ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మందుల సమస్య, ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. ఏదైనా ఇబ్బందులు వచ్చి హాస్పిటల్స్‌లో జాయిన్ అయితే.. రాష్ట్రంలో ఎక్కడా కూడా హెల్త్ కార్డ్స్‌ని స్వీకరించట్లేదు. మీరు డబ్బు పెట్టుకొని వైద్యం చేయించుకోండి.. తరువాత రీఇంబర్స్ చేసుకోండి అంటున్నారు. ఆ రీఇంబర్స్ చేసుకునే డబ్బు రావడానికి ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతుంది". - సుబ్బరాయన్, వెటరన్ ఆఫ్ ఏపీ ఎన్జీవో ,కన్వీనర్
"11వ పీఆర్సీకి సంబంధించి.. రాష్ట్ర పీఆర్సీల చరిత్రలో చాలా అన్యాయం జరిగింది. అది ఐఆర్ రూపంలో కావచ్చు. ఫిట్మెంట్ రూపంలో కావచ్చు. చరిత్రలో ఒక మైనస్ పీఆర్సీతో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది. 11వ పీఆర్సీ పూర్తి కాలేదు. 12వ పీఆర్సీ వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది". - ఐవీ రావు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ
మందులకు, వైద్యానికి కష్టంగా ఉంటూ పెన్షనర్ల ఆవేదన
ఇవీ చదవండి: